జైలుకెళితే పట్టం కడతారా?

Feb 10,2024 16:34 #jail in chief ministers

రాజకీయ నేతలు జైలుకెళితే వారికి పదవులు వరిస్తాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు మరోసారి ఈ ప్రశ్నకు దారి తీశాయి.  ఉదాహరణకు తెలంగాణ, పాక్‌ ఎన్నికలు.  తాజాగా జరిగిన పాక్‌  ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గెలుస్తారా? లేక దేశాన్ని విడిచి పారిపోయిన నవాజ్‌ షరీఫ్‌ గెలుస్తారా అనే సందేహాల మధ్య.. వీరిద్దరూ ఎవరికివారే తామే ప్రధానులమని… విక్టరీ స్పీచ్‌లు కూడా సోషల్‌మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలపై ఇప్పటికీ ఎన్నికల సంఘం ఫలానా పార్టీ గెలిచిందని ఖరారు చేయలేదు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ (పిటిఐ), నవాజ్‌ షరీఫ్‌ (పిఎంఎల్‌-ఎన్‌)లు మాత్రం తమ పార్టీ గెలవనుందంటే.. తమ పార్టీ గెలవనుందని బాకాలూదుకుంటున్నారు. ప్రస్తుతం అనధికార ఫలితాల ప్రకారం చూస్తే ఇమ్రాన్‌ ఖాన్‌ పిటిఐ పార్టీ అధికారంలోకొస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ప్రపంచదేశాల్లో కల్లా ధరలు విపరీతంగా పెరుగుతున్న దేశంగా పాక్‌ నిలిచింది. గతేడాది పాకిస్తాన్‌ ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతానికి చేరుకుంది. తినడానికి తిండి లేక అలమటిస్తున్న పాక్‌ ప్రజలు తోషిఖానా అవినీతి కేసులో ప్రధాన నిందితునిగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌కే పట్టం కట్టనున్నారా? ఆయన మరోసారి ప్రధాని అయితే ఆ దేశ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

రేవంత్‌రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, చంద్రబాబు

పాకిస్తాన్‌ సంగతి పక్కనపెడితే.. భారత్‌లో అందులోనూ ఎపిలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గతంలో జైలుకెళ్లారు. జైలుకెళ్లి వచ్చిన తర్వాత జగన్‌ సిఎం అయ్యాడు. ఇక ఎపి గత ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఇటీవల స్కిల్‌ డెవలపెంట్‌ కేసులో జైలుకెళ్లారు. ఆయన జైలుకెళ్లి వచ్చిన తర్వాత మరోసారి సిఎం అవుతారా? ఆయన స్వంత మెజార్టీతోనే సిఎం అవుతారా? లేక ఇతర పార్టీల పొత్తుతో సిఎం అవుతారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఓటునోటు కేసులో 2015లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఆయన టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి చేరి ముఖ్యమంత్రి అయ్యాడు.

శశికళ

వి .కె.శశికళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు. ఈమెకు 2017లో సుప్రీంకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేల్చింది. ఆ సమయంలో ఆమె జైలుకెళ్లారు. ఆమె జైలులో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు కూడా వచ్చాయి. అయతే 2021లో జైలు నుంచి బయటికొచ్చినా ఎఎఐడిఎంకె పార్టీలోని చీలికల వల్ల ఆమె ప్రస్తుతం రాజకీయాల్లోనే యాక్టివ్‌గా లేరు.

దేశంలోనే ఏళ్లతరబడి జైల్లో ఉన్న మరో నేత లాలూ

కేంద్ర రైల్వే మంత్రిగా, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆర్‌జెడి పార్టీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఈయన మన దేశ చరిత్రలో నిలిచిపోయే రాజకీయనాయకుడిగా ఉంటారు. 1996లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాణా కుంభకోణం కేసులో లాలూపై ఆరోపణలొచ్చాయి.  దీంతో ఆయన తన  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అనంతరం  ఆయన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి అయ్యారు. దాణా కుంభకోణం కేసులో ఆయన 1997లో  జైలుకెళ్లాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చాడు.

రాష్ట్రంలోనూ, దేశంలోనూ కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు నేతలు జైలుకెళ్లారు. వారు జైలుకెళ్లడం వల్ల వారికే కాదు.. వారి వారసులకు కూడా పదవులు వరిస్తున్నాయి. కేవలం ఫేస్‌ వాల్యూ మీద, సింపతి మీద కూడా రాజకీయాలు నడుస్తాయనడానికి వీరే సాక్ష్యాలుగా నిలిచారు. అవినీతి కేసుల్లోనో, లేక వివిధ ఆరోపణలపై జైలు కెళ్లినా.. ఆ తర్వాత తన పార్టీ బలంతోనే, ఇతర పార్టీల పొత్తులతోనో నేతలు మళ్లీ పదవుల్ని దక్కించుకోవడం విశేషం.

➡️