సందిగ్ధంలో బీమా !

Dec 15,2023 08:46 #doubt, #Insurance
  • ఖరీఫ్‌కు తన వాటా ప్రీమియం చెల్లించని రాష్ట్రం
  • దాటవేతలో కేంద్రం
  • కరువు, తుపాను రైతుల ఆందోళన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : పంటల బీమా విషయంలో సందిగ్ధత నెలకొంది. ఖరీఫ్‌ ముగిసి రెండున్నర నెలలవుతున్నా బీమా ఉందో లేదో తెలీకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన వంతు ప్రీమియం చెల్లించలేదని తెలుస్తోంది. ఉచిత పంటల బీమా కావడంతో ప్రీమియంలో రైతుల వాటా కూడా రాష్ట్ర సర్కారే చెల్లించాలి. రైతుల వాటా సైతం కంపెనీలకు చేరకపోవడంతో కేంద్రం నుంచి బీమా పథకాలకు ఆమోదం లభించలేదు. రాష్ట్రం తన వాటా ప్రీమియం చెల్లించనందున అటు కేంద్రమూ తాను భరించాల్సిన ప్రీమియం భాగాన్ని కంపెనీలకు బదలాయించలేదు. దాంతో ఖరీఫ్‌లో ఫసల్‌ బీమా, వాతావరణ ఆధారిత బీమా ప్రశ్నార్ధకంగా మారాయి. ఒకే సీజన్‌లో కరువు, తుపాన్‌ లక్షల ఎకరాల్లో పంటలను సర్వనాశనం చేశాయి. రైతులు పెట్టుబడులు నష్టపోయారు. కరువు పీడిత, తుపాన్‌ బాధిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు తిరుగుతున్నాయి. కేంద్ర నిబంధనల ప్రకారం ఖరీఫ్‌ బీమా ప్రీమియం చెల్లింపులకు గడువు ముగిసిందని చెబుతున్నారు. అదే జరిగితే విపత్తుల వలన అపార పంట నష్టాలు చవి చూసిన రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఫసల్‌లో చేరాక తిప్పలు

కేంద్రం నుంచి విడగొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 2019-20 రబీ నుంచి 2021-22 రబీ వరకు తానే స్వయంగా బీమా పథకాలు నిర్వహించింది. కంపెనీల తో సంబంధం లేకుండా కేంద్ర మార్గదర్శకాలకు లోబడి కొంచెం అటు ఇటుగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్‌లోనే బీమా పరిహారం సెటిల్‌ చేసింది. ఇక్కడ కూడా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందలేదన్న విమర్శలు న్నాయి. కాగా కేంద్రం ఒత్తిడి మేరకు 2022 ఖరీఫ్‌ నుంచి ఫసల్‌ బీమాలో రాష్ట్రం చేరింది. అప్పటి నుంచి కంపెనీలకు ప్రీమియం చెల్లింపులు తిరిగి మొదలయ్యాయి. గతేడాది ఖరీఫ్‌, రబీలో దిగుబడి ఆధారిత బీమా (ఫసల్‌)ను కంపెనీలు నిర్వహించగా, వాతావరణ బీమాను రాష్ట్ర సర్కారే ఇంప్లిమెంట్‌ చేసింది. గత ఖరీఫ్‌లో 75 లక్షల మంది రైతులు ఫసల్‌కు దరఖాస్తు చేసుకోగా 25 లక్షల మందే లర్హత సాధించారు. 50 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కంపెనీలకు రూ.1,800 కోట్లకుపైన ప్రీమియం చెల్లించగా, ఆ ఏడాది రైతులకు కంపెనీలు చెల్లించిన పరిహారం రూ.600 కోట్లు కూడా లేదు. 2022 రబీ బీమా నేటికీ రాలేదు.

రబీ వచ్చినా..

ప్రస్తుత 2023 ఖరీఫ్‌లో ఫసల్‌, వాతావరణ రెండు పథకాలనూ కంపెనీలకు అప్పగించారు. ఫసల్‌లో కొన్ని ప్రభుత్వరంగ సంస్థలుండగా, వాతావరణ బీమాను అచ్చంగా ప్రైవేటు కంపెనీలకే ఇచ్చారు. సెప్టెంబర్‌ ఆఖరుకు ఖరీఫ్‌ ముగిసింది. డిసెంబర్‌ సగంలో పడ్డా బీమా ఉందో లేదో అయోమయం నెలకొంది. ఇ-క్రాప్‌లో నమోదైన రైతులందరికీ బీమా వర్తిస్తుందన్నారు. ఇ-క్రాప్‌ అక్టోబర్‌ చివరి వరకు సాగింది. పైగా లోపభూయి ష్టంగా, తప్పుల తడకగా ఉంది. కౌలు రైతులకు ఎంట్రీ లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ పంట కోత ప్రయో గాలు జరుగుతున్నాయి. దిగుబడి ఆధారిత బీమాకు ఆ డేటానే ప్రామాణికం. వాతావరణ బీమాకు ఎపిఎస్‌పిపిఎస్‌ డేటా ఆధారం. కేంద్ర సమాచారం మేరకు ఫసల్‌ బీమాలో ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి మూడు జిల్లాల్లో 36 మంది రైతులే చేరారు. వాతావరణ బీమాలో అది కూడా లేదు. రాష్ట్రం తన వాటా ప్రీమియాన్ని చెల్లించనందునే కేంద్రం నుంచి ఆమోదం లభించలేదని తెలుస్తోంది. గడువు మీరితే పెనాల్టీ చెల్లించాలి. రాష్ట్ర సర్కారు బీమా అమలుకు టెండర్లు పిలిచి కంపెనీలను ఎంపిక చేసి, ఎందుకు ప్రీమియం చెల్లించలేదో స్పష్టత లేదు.కరువు, తుపాన్‌ బాధిత రైతులను ఆదుకుంటామని మాత్రం ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రబీ బీమా నడుస్తోంది. ఇక్కడా రబీ మొదలైంది.

➡️