జగన్‌ బస్సుకు డిపో మేనేజర్‌ కాపలా!

Apr 22,2024 02:30 #2024 election, #ap cm jagan, #bus tour

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి వరకు బస్సు యాత్ర చేపట్టారు. మార్చి 27న బస్సు యాత్ర మొదలైంది. ఏప్రిల్‌ 24న ముగుస్తోంది. ఇదంతా రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. కాగా జగన్‌ ప్రయాణిస్తున్న బస్సు గురించి తెలిస్తే జనం అవాక్కవ్వాల్సిందే. సిఎం కోసం ఎపిఎస్‌ ఆర్‌టిసి విజయవాడ మెయిన్‌ డిపో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో బస్సును కొనుగోలు చేసింది. మరికొన్ని నిధులతో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అంతేనా, యాత్ర ముగిసే వరకు ఆ బస్సును కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు ఏకంగా ఒక సీనియర్‌ డిపో మేనేజర్‌ను నిరంతర ప్రత్యక్షణ కోసం ఆర్టీసీ నియమించింది. విజయవాడ ఆటోనగర్‌ బస్‌ డిపో మేనేజర్‌ బస్సుకు అనుక్షణం కాపలాగా ఉంటున్నారు. వంద, రెండు వందల బస్సులు కలిగిన డిపోకు కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించాల్సిన సీనియర్‌ అధికారి ఒక్క సిఎం బస్సుకు కస్టోడియన్‌ కావడం విచిత్రం. యాత్రలో బస్సుకు చిన్న గీత పడినా, మచ్చలు పడినా, దుమ్ము ధూళి పడినా ఊరుకోవట్లేదు. దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్రైవర్లను, సహాయకులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సభల్లో వందల కిలోమీటర్లు రోజుల తరబడి బస్సు తిరుగుతోంది. ఇరుకు సందులు, గొందుల్లోకీ పోనీమంటున్నారు. కిక్కిరిసిన జనం మధ్యలోకీ వెళ్లమంటున్నారు. వైసిపి నేతలను గుంపులుగా బస్సుపైకి, లోపలికి అనుమతిస్తున్నారు. కానీ బస్సుకు మాత్రం ఏమీ కావొద్దని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని ఆర్టీసి సిబ్బంది వాపోతున్నారు. కాగా ప్రత్యేకంగా బస్సు కొనుగోలు చేసింది ముఖ్యమంత్రి అధికారిక పర్యటనల కోసమని, ఒక్క జగన్‌ కోసమే కాదని, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉపయోగ పడుతుందని ఆర్టీసి చెబుతోంది. కాగా ఎన్నికల కోడ్‌ వచ్చాక ముఖ్యమంత్రికి బస్సు సమకూర్చడంపై అభ్యంతరాలొస్తున్నాయి. అధికారిక పర్యటనలు కాదు ఎన్నికల ప్రచారం కోసం అయినందున బస్సు వినియోగానికి అద్దె వసూలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా బస్సు యాత్ర దగ్గరికి ఉన్నతాధికారులొస్తున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అందుకు వైసిపి నేతలు గట్టిగా కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయినప్పుడు, ఆ ప్రాంతంలో ప్రత్యేక బస్సులో బాబు కుంటుంబం ఉందని, తొక్కిసలాట ప్రాంతం నుంచి బాబు ఉన్న బస్సును ఉన్నతాధికారులు కొంత దూరం నెట్టుకుంటూ వెళ్లారని గుర్తు చేస్తున్నారు.

➡️