సిక్కోలులో టికెట్ల లొల్లి

  • ప్రధాన పార్టీలకు అసమ్మతి బెడద
  •  తిరగబడ్డ ఆశావహులు
  •  స్వతంత్ర అభ్యర్థులుగా ప్రచారం

ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : టికెట్ల ప్రకటన పూర్తయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో వైసిపి, టిడిపిలో అసమ్మతి రాజుకుంది. నాలుగు నియోజకవర్గాల్లో వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అభ్యర్థులను మార్చాలంటూ అసమ్మతి నాయకులు పార్టీ అధిష్టానంపై పలు రూపాల్లో ఒత్తిడి తెచ్చినా అధిష్టానం వారినే మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో రెండుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు టిడిపి శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి ఇబ్బందులను తెచ్చుకుంది. అధిష్టానం తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభ్యర్థుల మార్పు జరుగుతుందంటూ ప్రచారం సాగడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జులు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టిడిపి నుంచి సిట్టింగు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, వైసిపి అభ్యర్థిగా పిరియా విజయ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైసిపి ఎంపిటిసి వసుపత్రి చక్రవర్తి రెడ్డి పోటీ చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థిగా పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, టిడిపి నుంచి గౌతు శిరీష మళ్లీ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మజ్జి త్రినాథ్‌బాబు బరిలో ఉన్నారు. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత, గ్రూపుల పోరు వైసిపికి బలహీనతగా ఉంది. టిడిపి అభ్యర్థిగా గౌతు శిరీష 2019లో ఓటమిపాలైన తర్వాత కొంత సానుభూతి, శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడం బలంగా కనబడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున మజ్జి కుటుంబం నుంచి ఆయన కుమారుడు మజ్జి త్రినాథ్‌బాబు పోటీ చేస్తుండడం, కాంగ్రెస్‌ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో వైసిపికి నష్టం కలిగించవచ్చన్న చర్చ నడుస్తోంది.
టెక్కలిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, సిట్టింగు ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. పార్టీలో గ్రూపులు, దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి దువ్వాడ వాణి సైతం శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం బలహీనతగా ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత వైసిపిలోకి వెళ్లిన టిడిపి శ్రేణులు మళ్లీ పార్టీలోకి వస్తుండడంతో కొంత బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తున్నారు. ఆమె 2003లో కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి కింజరాపు ఎర్రన్నాయుడు చేతిలో ఓటిమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఎర్రన్నాయుడును ఓడించారు. నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సిఎం, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరోసారి పోటీ పడుతున్నారు. ధర్మాన కృష్ణదాస్‌ సతీమణి పద్మప్రియ, కుమారుడు కృష్ణచైతన్య తీరుతో తీవ్ర విసిగివేశారిన నాలుగు మండలాల నాయకులు ఎన్నికల్లో ఆయనను ఓడిస్తామని చెప్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు వారంతా సమావేశమై కృష్ణదాస్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎం నరసింహమూర్తి పోటీచేస్తున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసిపి తరపున రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, టిడిపి తరపున గొండు శంకర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పైడి నాగభూషణరావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవికి టికెట్‌ నిరాకరించడంతో టిడిపి శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు.. గుండ కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు.
పాతపట్నం నియోజకవర్గంలో వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టిడిపి అభ్యర్థిగా మామిడి గోవిందరావు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్యెల్యే కలమట వెంకటరమణకు టిడిపి టికెట్‌ నిరాకరించడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు.. కలమట వెంకటరమణను పిలిచి మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. టికెట్‌ దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కొప్పురౌతు వెంకటరావు ప్రభావంతో వైసిపికి నష్టం కలుగుతుందనే చర్చ నడుస్తోంది.
ఆమదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభాపతి తమ్మినేని సీతారాం, టిడిపి నుంచి మాజీ విప్‌ కూన రవికుమార్‌ పోటీ చేస్తున్నారు. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పొందూరు మండలానికి చెందిన సువ్వారి గాంధీ ఇండిపెండెంటుగా ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గ వైసిపి నాయకులు ప్రచారానికి దూరంగా ఉండటం వైసిపికి మైనస్‌గా మారింది. మరోవైపు ఒకరిద్దరు నాయకులు ఇండిపెండెంట్లుగా బరిలో దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సనపల అన్నాజీరావు పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చెర్ల సీటును బిజెపికి కేటాయించడంతో అభ్యర్థిగా ఎన్‌ ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో టిడిపి నాయకుడిగా ఉండటం, సీనియర్‌ నాయకుడు కళా వెంకటరావు అనుచరుడు కావడంతో టిడిపి శ్రేణులు సహకరిస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై వ్యతిరేకత, గ్రూపుల పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కరిమజ్జి మల్లేశ్వరావు పోటీ చేస్తున్నారు.

రామ్మోహన్‌ నాయుడు హ్యాట్రిక్‌ కొట్టేనా..?
శ్రీకాకుళం ఎంపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. కళింగ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌ను వైసిపి తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారంపై దృష్టి సారించారు తప్ప ఎంపి అభ్యర్థి విషయాన్ని పట్టించుకోకపోవడం మైనస్‌గా ఉంది. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో కలమట, గుండ కుటుంబాలకు టికెట్లు నిరాకరిస్తే మాత్రం కొంత కష్టంగా మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.

➡️