అనుమతుల కోసం నజరానాలు

Mar 16,2024 10:41 #Najranas, #permissions
  • రూ.825 కోట్ల విరాళాలు
  • బాండ్ల కొనుగోలులో మైనింగ్‌, స్టీల్‌ కంపెనీలు

న్యూఢిల్లీ : ఏ ప్రాజెక్టు నిర్వహించాలన్నా ప్రభుత్వం నుండి అనుమతులు ఊరికే రావు. అంతో ఇంతో సమర్పించుకోవాల్సిందే. దేశంలో పేరెన్నికగన్న మైనింగ్‌, స్టీల్‌ కంపెనీలు తమ ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందేందుకు ఎన్నికల బాండ్ల పథకాన్ని ఉపయోగించుకున్నాయి. ఈబీలను కొనుగోలు చేసి పాలకులకు నజరానాలు అందజేశాయి. అయినా ఇప్పటికీ కొన్ని కంపెనీలు అనుమతుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో బహిర్గతం చేసిన వివరాల ప్రకారం దేశంలోని బడా మైనింగ్‌, స్టీల్‌ కంపెనీలు కోట్లాది రూపాయల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి. వేదాంత లిమిటెడ్‌, రుంగ్తా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌), ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఈఎంఐఎల్‌), డెంపో సంస్థలు కలిపి రూ.825 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలలో రుంగ్తా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.100 కోట్లు, వేదాంత లిమిటెడ్‌ రూ.376 కోట్లు, ఈఎంఐఎల్‌ రూ.224.5 కోట్లు, జేఎస్‌పీఎల్‌ రూ.123 కోట్లు, డెంపో రూ.1.5 కోట్లు బాండ్ల కొనుగోలు కోసం వెచ్చించాయి.

ఎన్నికలకు ముందే బాండ్లు కొన్న ‘వేదాంత’
వేదాంత లిమిటెడ్‌ మొత్తం రూ.376 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయగా వాటిలో రూ.98 కోట్ల విలువైన బాండ్లను ఒక్క 2022 జనవరిలోనే కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా శాసనసభలకు ఎన్నికలు జరగడానికి ముందు వీటిని కొనుగోలు చేయడం గమనార్హం. వేదాంత గ్రూపులోని సెసా గోవా కంపెనీ దేశంలోని అతి పెద్ద ఇనుప ఖనిజపు మైనింగ్‌ కంపెనీలలో ఒకటి. ఒడిషాలో ఈ కంపెనీకి మైనింగ్‌ వ్యాపారాలు ఉన్నాయి. వేదాంత గ్రూపుకు ఇనుప ఖనిజం, చమురు-గ్యాస్‌, రాగి, అల్యూమినియం, ఉక్కు రంగాలలో వ్యాపారాలు ఉన్నాయి.

అనుమతుల కోసం ఎదురు చూపులు
జెఎస్‌పిఎల్‌ ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, జార్ఖండ్‌ రాష్ట్రాలలోని మైనింగ్‌, విద్యుత్‌, ఉక్కు రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. ఈ కంపెనీ విరాళాలన్నీ 2022 అక్టోబర్‌, 2023 నవంబర్‌ మధ్య కాలంలో ఇచ్చినవే. ఇక ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఈఎంఐఎల్‌ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో బందర్‌ డైమండ్‌ ప్రాజెక్టును చేపట్టింది. 2019-2022 మధ్యకాలంలో ఈ కంపెనీ రూ.224.5 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. వీటిలో 2019లో రూ.50 కోట్లు, 2020లో రూ.20 కోట్లు, 2021లో రూ.104.5 కోట్లు, 2022లో రూ.50 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. దేశంలోని అతి పెద్ద బొగ్గు మైనింగ్‌ కంపెనీలలో ఈఎంఐఎల్‌ ఒకటి. 2019లో ఈ కంపెనీ బందర్‌ డైమండ్‌ ప్రాజెక్ట్‌ కోసం మైనింగ్‌ లీజు పొందింది. అయితే స్థానికుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం కాలేదు. పర్యావరణ అనుమతుల కోసం కంపెనీ అందజేసిన దరఖాస్తును 2020లో పర్యావరణ మంత్రిత్వ శాఖ తిప్పిపంపింది. ఈ ప్రాజెక్టు పన్నా టైగర్‌ రిజర్వ్‌ సమీపంలో ఉండడంతో ముందుగా అటవీ, వన్య ప్రాణులకు సంబంధించిన అనుమతులు పొందాలని సూచించింది. అటవీ అనుమతులకు సంబంధించిన ఈఎంఐఎల్‌ ప్రతిపాదనలపై మంత్రిత్వ శాఖ అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
నోయిడాకు చెందిన జీహెచ్‌సీఎల్‌ కంపెనీ 2019లో రూ.50 లక్షల విలువ కలిగిన బాండ్లను కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని సోడా యాష్‌ ప్లాంటు, కాప్టివ్‌ పవర్‌ ప్లాంటు ఆధునీకరణ నిమిత్తం ఈ కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. అయితే తాను అడిగిన వివరణలను సమర్పించలేదన్న కారణంతో 2019 నవంబరులో ఈ ప్రాతిపాదనను మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది.

నిబంధనల్లో మార్పుల కోసం…
నోయిడాకు చెందిన బల్దోతా గ్రూపునకు చెందిన కంపెనీ ఎంఎస్‌పీఎల్‌ లిమిటెడ్‌ది కూడా ఇలాంటి కథే. ఇనుప ఖనిజం మైనింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్న ఈ కంపెనీ 2019 ఏప్రిల్‌లో కోటి రూపాయలు, 2023 ఏప్రిల్‌లో మూడు కోట్ల రూపాయల విలువ కలిగిన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. తన ఇనుప ఖనిజం మైనింగ్‌ ప్లాంట్లకు సంబంధించిన నియమ నిబంధనల్లో ఈ కంపెనీ కొన్ని మార్పులు కోరుకున్నది. కంపెనీ కోరిన మార్పులకు పర్యావరణ మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరిలో అంగీకారం తెలిపింది.

➡️