పోలవరం పునరావాసానికి నిధులివ్వరు

  • గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు
  • రెండేళ్లుగా రూ.184 కోట్లు బకాయి

ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పోలవరం ప్రాజెక్టులో సహాయ పునరావాస పనులకు కష్టాలు తీరడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాక చిన్నచిన్న కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. గత రెండేళ్లుగా ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తులు చేసుకున్నా నిధులు విడుదల కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమకు రావాల్సిన నిధులపై ఆర్థికశాఖకు మొరపెట్టుకుంటూ సుదీర్ఘ లేఖ రాశారు. పనులు చేసేందుకు తీసుకున్న రుణాలతో కష్టాల్లోకి చేరుకుంటున్నామని, వాటిని తీర్చలేక సతమతమవుతున్నామని వారు చెబుతున్నారు. పునరావాస కేంద్రాల పనులకు 2022 ఆగస్టు నుంచిప నిధులు విడుదల కావడం లేదు. మొత్తం రూ.184 కోట్ల వరకు తమకు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. 2015-16 నాటి ధరల ప మేరకే ఇప్పటికీ పనులు చేస్తున్నామని, నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయినా కొత్త రేట్లు అమలు కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్నుంచి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో సవరణలు లేకపోవడంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని వారు లేఖలో పేర్కొన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత ఇదే పరిస్థితి కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని వారు
వాపోతున్నారు.
పెండింగ్లో 80 బిల్లులు
చేసిన పనులకు సంబంధించి ఇప్పటి వరకు 80 వరకు బిల్లులు ఆర్థిక శాఖ వద్దనే పెండింగ్లో ఉన్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ పనులు చేశామని వారు అంటున్నారు. ఈ బిల్లులు రిజర్వు బ్యాంకు వద్దనే పెండింగ్లో ఉన్నట్లు వారు చెబుతున్నప్పటికీ, వాటిని పరిష్కరించాల్సింది మాత్రం రాష్ట్ర ఆర్థికశాఖేనని తెలుస్తోంది. గతంలో కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కేవలం రూ.16.27 కోట్లు చెల్లించి చేతులు దులుపుకొన్న అధికారులు మిగిలిన బిల్లులపై మాత్రం ఇప్పటికీ స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపించి తమకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

➡️