ధాన్యం రైతుకు పు(పె)ట్టెడు కష్టాలు

Jan 28,2024 11:02 #grain farmer
  • ఆర్‌బికెల్లో నిర్ణయించిన ధరలో మిల్లర్ల కోత
  • ఆన్‌లైన్లో దూర ప్రాంత మిల్లులకు కేటాయింపులు
  • రవాణాకు కిరాయిల మోత

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పుకు చెందిన మల్లుపెద్ది నారాయణ తన ఆరు ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని స్థానిక రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ ధాన్యంలో నూక శాతం ఎక్కువ వస్తోందనే కారణంతో ఆర్‌బికెలో 75 కిలోల బస్తాకు రూ.1,600 ధర నిర్ణయించారు. ఆన్‌లైన్లో పేర్కొన్న విధంగా ఈ ధాన్యాన్ని మూడు రైస్‌ మిల్లులకు ఆ రైతు తరలించాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న రైస్‌ మిల్లు, చల్లపల్లి మండలం మాజేరు రైస్‌ మిల్లుల వారు ఆర్‌బికెలో నిర్ణయించిన ధరకే ధాన్యం కొనుగోలు చేశారు. పాగోలు పద్మజా మోడరన్‌ రైస్‌ మిల్లు వారు మాత్రం బస్తాకు రూ.1,350 మాత్రమే చెల్లిస్తామని రైతుకు చెప్పారు. మిల్లులో ధర తగ్గించిన విషయాన్ని ఆర్‌బికె ట్రక్‌ షీట్‌లో నమోదు చేయాలని రైతు పట్టుబట్టినా మిల్లరు అంగీకరించలేదు. దీంతో, చివరకు రూ.1400కు మించి ఇచ్చేది లేదని మిల్లరు తేల్చి చెప్పారు. దీంతో, ఆర్‌బికెల్లో నిర్ణయించిన ధర కన్నా బస్తాకు రూ.200 తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ మిల్లులో అమ్మిన 60 బస్తాలకు సంబంధించి రూ.12 వేలు ఆయన నష్టపోయారు. ఈ ఒక్క రైతుదే కాదు… జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని, మిల్లర్లు అడిగిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోయారు.ధాన్యం అమ్మకాల్లో రైతులకు పు(పె)ట్టెడు కష్టాలు ఎదురవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బికెల్లో) నిర్ణయించిన ధరల్లోనూ రైస్‌ మిల్లర్లు భారీగా కోతపెడుతున్నారు. ఆన్‌లైన్‌లో చూపిన విధంగా ధాన్యం దూర ప్రాంత మిల్లులకు తరలించాల్సి రావడంతో అదనపు కిరాయిల భారం రైతులు, కౌలు రైతులపై పడుతోంది. మరోపక్క ధాన్యం నింపడానికి అవసరమైన సంచులు రైతులకు సకాలంలో అందడం లేదు. గత ఖరీఫ్‌ సీజపన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 3.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. పంట దిగుబడులు చేతికి వచ్చే సమయంలో వచ్చిన మిచౌంగ్‌ తుపాను రైతులను నిలువునా ముంచింది. దీని ప్రభావంతో జిల్లాలోని 1,55,766 ఎకరాల్లో వరి పంట తడిసిపోయింది. తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనల్లో ఎటువంటి సడలింపూ ఇవ్వలేదు. పైగా, ఆర్‌బికెల్లో నిర్ణయించిన ధరకే మిల్లర్లు కొంటారని ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యానికి 75 కిలోల బస్తాకు కనీస మద్దతు ధర రూ.1,653 చెల్లించాల్సి ఉంది. ధాన్యం నాణ్యతా ప్రమాణాలు ప్రామాణికంగా ఆర్‌బికెల్లో ధర నిర్ణయిస్తున్నారు. ఆ ధర కూడా కొన్ని మిల్లుల్లో రైతులకు దక్కడం లేదు.

రవాణా కష్టాలు !

గతంలో ఆఫ్‌లైన్‌లో ధాన్యం రవాణాకు అవకాశం ఉంది. తమకు సమీపంలోని మిల్లులకు రైతులు ధాన్యాన్ని రవాణా చేశారు. కిరాయిల భారం తగ్గించుకున్నారు. సంక్రాంతి పండగ తర్వాత ఆన్‌లైన్‌కు మార్చారు. దీంతో, అత్యధికంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్‌ మిల్లులకూ రైతులు ధాన్యం తరలించాల్సి వస్తోంది. 90 సెంట్లు భూమి ఉన్న జంధ్యాల సుబ్రమణ్యానికి 49 సారలు (40 కిలోలు ఒక సార) దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని 13 కిలోమీటర్ల దూరంలోని రైస్‌ మిల్లుకు తరలించాల్సి వచ్చింది. ట్రాక్టర్‌లో మిల్లుకు తరలించిన తర్వాత ఆన్‌లైన్‌ సమస్యలు ఏర్పడ్డాయి. దిగుమతికి 36 గంటలు ఆలస్యమైంది. రూ.3,700 ట్రాక్టర్‌ కిరాయి చెల్లించాల్సి వచ్చింది. ఒక్కో సారకు రూ.75 చొప్పున కిరాయి పడింది. ప్రభుత్వం సారకు రూ.10 చొప్పున 29 సారలకు రూ.250 మాత్రమే రైతుకు చెల్లిస్తుంది. మిగిలిన రూ.3,450 రైతు చెల్లించాల్సి వచ్చింది. ఘంటసాల మండలంలోని రైతులకు 35 కిలోమీటర్ల దూరంలోని కోడూరు, మచిలీపట్నం రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించాల్సి వస్తోంది. చల్లపల్లి-కోడూరు రోడ్లు అధ్వానంగా ఉండడంతో ధాన్యం రవాణాకు వాహన యజమానులు అదనపు కిరాయిలు తీసుకుంటున్నారు. ఐదు టన్నుల ట్రక్కుకు రూ.6 వేలు రైతులు చెల్లించాల్సి వస్తోంది.

ఆర్‌బికె సిబ్బంది సంచులు లేవంటున్నారు

నేను వరి కుప్పనూర్చి 25 రోజులకుపైగా అవుతోంది. ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆర్‌బికె సిబ్బంది సంచులు కొరతగా ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.-అన్నే శివప్రసాద్‌, పొణుకుమాడు గ్రామం, ఉంగుటూరు మండలం

➡️