రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం

May 1,2024 00:04 #farmers, #Financial assistance
  •  టిడిపి, వైసిపి వైఫల్యంతో అన్నదాత కుదేలు
  •  దశాబ్దకాలంలో తగ్గిన విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు
  •  వ్యయ సాయంగా మారటంతో భూములను వదిలేస్తున్న రైతులు

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం త్వరలోనే ఆ సార్థకతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం కనపడుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో విసుగుచెందుతున్న అన్నదాత వ్యవసాయాన్ని విడిచిపెట్టేసి, ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవటం, సమయానికి నీరు అందకపోవటం తదితర కారణాలతో వ్యవసాయం కాస్తా.. ‘వ్యయ’ సాయంగా మారటంతో దిగాలు చెందుతున్న రైతన్నలు వ్యవసాయం చేయలేక పంటపొలాలను బీడు భూములుగా వదిలేస్తున్నారు.
గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రంలో ఒకసారి టిడిపి ప్రభుత్వం, మరోసారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో గడిచిన దశాబ్థాకాలంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం దాదాపుగా 13 లక్షల ఎకరాలు తగ్గింది. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖరీఫ్‌, రబీ కలిసి మొత్తం 65.61 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరిగేది. ఈ మొత్తం విస్తీర్ణంలో 21 రకాలకుపైగా పంటలను సాగు చేసేవారు.
ప్రధానంగా వరిని అత్యధిక హెక్టార్లలో సాగు చేస్తుండగా.. జొన్న, మొక్కజొన్న, రాగి, మినుము, పెసలు, కంది, ఇతర పప్పుదినుసులతోపాటు, వేరుశనగన, సనఫ్లవర్‌, సోయబీన్‌ వంటి నూనె దినుసులు, పత్తి, జూట్‌, పొగాకు, చెరకు వంటి వాణిజ్య పంటలను కూడా పండించేవారు. ప్రతి సంవత్సరం అటు ఖరీఫ్‌లో, ఇటు రబీలో ఒక టార్గెట్‌ పెట్టుకుని, దానికనుగణంగా వ్యవసాయాన్ని సాగించేవారు. కానీ ప్రస్తుతం ఆ పంటల సాగు విస్తీర్ణం చాలా వరకు రాష్ట్రంలో తగ్గిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వాల వైఫల్యం
రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో వ్యవసాయం బాగానే జరిగేది. రాష్ట్ర విభజన సమయంలో అంటే 2013-2014లో రాష్ట్రంలో మొత్తం 65.61 లక్షలహెక్టార్లలలో పంటల సాగు ఉండేది. తదనంతరం ఆ సాగు విస్తీర్ణం విపరీతంగా తగ్గిపోయింది. వ్యవసాయాన్ని పండుగ చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని గాలికొదిలేయటంతో, రైతులు దుర్భర పరిస్థితులు అost నుభవించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014-15లో రాష్ట్రంలో సాగు భూమి 62.35 లక్షల హెక్టార్లు ఉండేది. తర్వాత క్రమంగా తగ్గుతూ ఆయన అధికారం దిగిపోయే సమయానికి అంటే 2018-19 నాటికి 60.49 లక్షల హెక్టార్లకు తగ్గింది. తదనంతరం వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటూ వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు విస్తీర్ణం మరింత తగ్గసాగింది. 2018-19లో 60.49 లక్షల హెost క్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు ఉండగా.. 2021-22 నాటికి 60.38 లక్షలకు తగ్గింది. ఇదే క్రమంలో 2023-24 నాటికి రాష్ట్రంలో కేవలం 58.75 లక్షల హెక్టార్లలోనే పంటల సాగు జరిగింది. 2023 ఖరీఫ్‌లో పంటల సాగు టార్గెట్‌ ఏరియా 35.75 లక్షల హెక్టార్లుగా ఉండగా.. రబీలో 23 లక్షల హెక్టార్లలో పంటల సాగు టార్గెట్‌ ఉంది. ఖరీఫ్‌ సీజన్‌, రబీ పూర్తయ్యే సరికి ఈ టార్గెట్‌ ఏరియా కూడా పంటలసాగు జరగలేదు.

➡️