రూ. 3 లక్షల కోట్లకుపైనే…!

Feb 7,2024 10:03 #Rs.3 lakh crores
  • భారీగా ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ప్రతిపాదించనుందని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైనే ప్రతిపాదనలు సిద్ధమైనాయి. నేటి (బుధవారం) ఉదయం ఎనిమిది గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకోనున్నారు. అనంతరం పదకొండు గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌గానే ఉంటుందని తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు, మరిన్ని ఎక్కువ కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది 2,79,279 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఈసారి 3.12 లక్షల కోట్ల నుంచి 3.13 లక్షల కోట్ల మధ్య ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది. యువతను ఆకట్టుకునేందుకుగాను ఉద్యోగాల కల్పన, యువతకు ఇతర ఉపాథి రంగాలకు కూడా గతేడాది కన్నా ఎక్కువ నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయని సమాచారం. అయితే అభివృద్ధి కూడా తమ లక్ష్యాల్లో భాగమని చెప్పుకొనేందుకుగాను గతేడాది కంటే ఎక్కువ నిధులను పెట్టుబడి వ్యయంగా చూపించేందుకు ఆస్కారం ఉందని అధికార వర్గాల సమాచారం. తాజా ప్రతిపాదనల్లో రూ. 2.50 లక్షల కోట్ల నుంచి 2.60 లక్షల కోట్ల వరకు రెవెన్యూ వ్యయానికే కేటాయించనున్నారని సమాచారం. పెట్టుబడి వ్యయానికి కేవలం 35 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చునని చెబుతున్నారు.

రుణమాఫీ, ఉచిత ప్రయాణంపై ఆలోచన !

రైతులను ఆకర్షిరచేరదుకుగాను రుణ మాఫీపై ప్రభుత్వం సమాలోచన చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో రుణ మాఫీ అమలు చేసినా, తరువాత నిలిపివేశారు. అయితే ఎన్నికల సమయం కావడంతో మరోసారి రుణమాఫీపై చర్చించినట్లు తెలిసింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గత నెల్లోనే చంద్రబాబు ప్రకటించడం, దానిపై ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆర్టీసీ అధికారులతో చర్చించడం జరిగింది. ఇదే అంశాన్ని బడ్జెట్‌లో పెడితే ఎలా ఉంటుందన్న కోణంలో ఆర్థికశాఖతో చర్చలు జరిపినట్లు సమాచారం.

➡️