ILO : దశాబ్దకాలంలో పడిపోయిన కార్మికుల నిజవేతనాలు 

Apr 2,2024 12:28 #ILO study, #real wages, #workers

న్యూఢిల్లీ :    దశాబ్దకాలంలో సాధారణ జీతం పొందే కార్మికుల నెలవారీ నిజ వేతనాలు ప్రతి ఏడాది ఒక శాతం మేర తగ్గుతున్నాయి. 2022 వరకు ఇదే పరిస్థితి కొనసాగినట్లు ఓ సర్వే తెలిపింది. నాణ్యమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, మహమ్మారి ప్రతికూల ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆ సర్వే వెల్లడించింది. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఒ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డి)లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

సాధారణ వేతన కార్మికుని సగటు నెలవారీ నిజ  వేతనం 2012లో రూ.12,100గా ఉండగా, 2022 నాటికి రూ.10,925కి పడిపోయింది. ప్రభుత్వం నుండి సేకరించిన అధికారిక సమాచారాన్ని విశ్లేషించి ఐఎల్‌ఒ ఈ నివేదికను రూపొందించింది.

గత నెలలో విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్ మెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం… గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో నిజ  వేతనాలు వేగంగా పడిపోయాయని, 2012లో రూ.13,616గా ఉండగా 2022లో రూ.12,616కి పడిపోయాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.8,623 నుండి రూ.8,966కి పెరిగాయి.

సాధారణ వేతనం లేదా జీతం పొందే కార్మికులు అంటే ఎక్కువ కాలం కొనసాగే కార్మికులు. వీరికి నెలవారీ లేదా వారానికి జీతాలు లేదా వేతనాలు  చెల్లించవచ్చు. ఈ కేటగిరీ కింద ఆశావర్కర్లు, ఇంటి పనివారు, గార్డ్స్‌, ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసే కార్మికులు ఉంటారు. 

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ కార్మికులలో చాలా తక్కువ నిష్పత్తిలో ఉన్నారని, వారి జీతాలు పెరిగినప్పటికీ… వారి నిజ వేతనాలలో స్తబ్దతను ఎదుర్కొంటున్నది మాత్రం అధికంగా ప్రైవేట్‌ రంగ ఉద్యోగులేనని ఐహెచ్‌డి డైరెక్టర్‌ అలఖ్‌ ఎన్‌ శర్మ తెలిపారు.

మూడేళ్లను ప్రామాణికంగా తీసుకుని సాధారణ వేతనం (దీర్ఘకాలం కార్మికులుగా కొనసాగే వారు పొందే వేతనం), రోజువారీ కూలీ, స్వయం ఉపాధి పొందే కార్మికుల వేతనాలను వివరించారు. ఈ సమాచారాన్ని ద్రవ్యోల్బణాన్ని అనుసరించి సవరించారు.

సాధారణ వేతనం 2012లో నెలవారీ సగటు వేతనం రూ.12,100గా ఉండగా, 2019 నాటికి రూ.11,155కి పడిపోయింది. 2022 నాటికి రూ. 10,925కి తగ్గాయి. వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్‌) మైనస్‌ 1కి క్షీణించింది.

అదే సమయంలో రోజువారీ కూలీల నెలవారీ సగటు వేతనాలను పట్టికను పరిశీలిస్తే.. 2012 రూ.3,701 ఉండగా, 2019లో రూ.4,464కి చేరగా, 2022 నాటికి రూ.4,712కి చేరింది. వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్‌) 2శాతానికి చేరింది.

స్వయం ఉపాధి కార్మికులను పరిశీలిస్తే 2012లో వివరాలు అందుబాటులో లేవు. 2019లో రూ.7,017కి ఉండగా, 2022 నాటికి రూ.6,843కి క్షీణించింది.
గార్డ్స్‌, ఇంటిపనివారు వంటి తక్కువ నైపుణ్యం కలిగిన సాధారణ కార్మికులకు వారి యజమానులు దామాషా ప్రకారం వేతనాలను పెంచకపోవడంతో వారి నిజ వేతనంలో  స్తబ్దతను ఎదుర్కొంటున్నారని తెలిపారు.  మరో అంశం ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ రంగంలో వృద్ధి కార్మికులకు వేతనాలను అందించలేదు. దీనిలో యజమానులు లాభపడినట్లు సమాచారం.

నివేదికను అనుసరించి సాధారణ కార్మికుల్లో సుమారు 39 శాతం మంది 2022లో నిజవేతనం రూ.5,001 నుండి రూ.10,000 వరకు పొందారు. సుమారు 23 శాతం మంది రూ.2,001 నుండి రూ.5,000 వరకు పొందారు. కేవలం 14.9 శాతం మంది మాత్రమే 2012లో 17.1 శాతం నుండి 2022లో రూ.20,000కు పైగా వేతనాన్ని పొందారు.

స్వయం ఉపాధి కింద ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఇజిఎ) కార్మికులు సహా వృత్తి నిపుణులు (ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు), పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. కొవిడ్‌ మహమ్మారి వీరిని కోలుకోలేనంతగా దెబ్బతీసింది. పట్టణప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో వృత్తి నిపుణులు ఆదాయం తీవ్రంగా ప్రభావం చూపిందని అలఖ్‌ ఎన్‌ శర్మ వివరించారు.

➡️