నష్టపోయిన రైతులను ఆదుకోండి : సిపిఎం 

Dec 8,2023 10:46 #cpm, #demands, #farmers, #lost, #support
  • ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌
  • క్షేత్రస్థాయి పరిశీలన చేసిన నాయకులు

ప్రజాశక్తి – యంత్రాంగం : ‘మిచౌంగ్‌ తుపాను వల్ల కురిసిన వర్షాలకు వరితోపాటు మొక్కజొన్న, పొగాకు, పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. వర్షాలు, ఈదురుగాలులకు వరి పంటలు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం తడవడంతో మొక్కలు వచ్చాయి’ అని సిపిఎం నేతల ఎదుట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి పంటలు సాగు చేశామని, తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో తుపాను, భారీ వర్షాలు దెబ్బతీశాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. తుపాను కారణంగా ముంపు కు గురైన పంట పొలాలను సిపిఎం నేతలు గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

అప్పులు తెచ్చి ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టామని, తుపాను కారణంగా ధాన్యం తడవడంతో మొక్కలు వచ్చాయని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి, తాండవపల్లి గ్రామాల్లోని రైతులు సిపిఎం నేతల ఎదుట వాపోయారు. సగం వరకూ పంటను కోశామని అదంతా తడిసి ముద్దయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుతో కలిసి ఎకరాకు రూ.40 వేల వరకూ నష్టం వాటిల్లిందని సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు ఎదుట వాపోయారు. కాకినాడ జిల్లా కరప మండలంలో సిపిఎం కాకినాడ కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు పర్యటించి నీట మునిగిన వరిపొలాలు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

నెల్లూరు జిల్లా కోవూరులో దెబ్బతిన్న తమలపాకు తోటలు, అరటి సాగు తోటలను రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు నిరంజన్‌ బాబురెడ్డి పరిశీలించారు. ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ జాకరవలస గ్రామంలో దెబ్బతిన్న వరి, రాజ్మా, వలిసెలు, చిక్కుడు తదితర పంటలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర నేతృత్వం లో సిపిఎం నేతలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ పరిధిలో ఎపి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామరావు పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలో నీట మునిగిన పంట పొలాలను సిపిఎం నేతలు పరిశీలించి పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి, కాటంపూడి, జాలిపూడి గ్రామాల్లో ముంపునకు గురైన పొలాల్లో నీరు తోడుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని మల్లవరం, మల్లవరం లంక, లిఖితపూడి గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పరిశీలించారు. వరితోపాటు ఆక్వా, కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర పంటల రైతులను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండలో దెబ్బతిన్న పొలాలను సిపిఎం, రైతు సంఘాల నాయకులు పరిశీలించారు. ప్రతి బాధిత రైతుకూ నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రైతులను ఆదుకోవాలని దుగ్గిరాలలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో నేలకొరిగిన అరటి పంటను ఎపి రైతు సంఘం నాయకులు పరిశీలించారు.

➡️