తెలంగాణ బిజెపి నేతకు టిడిపి బాపట్ల ఎంపి టికెట్‌

Mar 22,2024 16:14 #list, #TDP, #TDP candidates
  • దేవినేని ఉమా, కళా వెంకట్రావుకు మొండిచెయ్యి
  • మూడో జాబితా విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణకు చెందిన బిజెపి నేత టి. కృష్ణప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ నుండి ఎంపి అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం విడుదల చేసిన మూడవ జాబితాలో ఆయన పేరు చోటుచేసుకుంది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో టిడిపి శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. తెలంగాణ డిజిపిగా పనిచేసిన కృష్ణప్రసాద్‌ ఉద్యోగ విరమణ అనంతరం బిజెపిలో చేరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలోనే ఎన్నికల బరిలోకి దిగాలని భావించారు. కంటోన్మెంట్‌, వరంగల్‌ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒకదానిని తనకు కేటాయించాలని బిజెపి నాయకత్వాన్ని కోరారు. ఈ మేరకు స్థానికంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని బాపట్ల అభ్యర్థిగా బరిలోకి దించుతుండటం స్థానిక టిడిపి శ్రేణుల్లో కలకలం రేపింది. ఆ సీటునుండి బరిలోకి దిగాలని భావిస్తున్న ఆశావహులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ ప్రసాద్‌కు టిడిపి సభ్యత్వం కూడా లేదని చెబుతున్నారు. బిజెపి సభ్యత్వం ఉన్న వ్యక్తికి టిడిపి టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బాపట్ల సీటును ఆ పార్టీ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు ఎంఎస్‌ రాజు, వైసిపి నుంచి టిడిపిలో చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆశించారు. ఎంఎస్‌ రాజుకు దాదాపుగా ఖరారైందని నేతలు భావించారు. కానీ చివరి నిమిషంలో బిజెపి నేతకు టిక్కెట్‌ దక్కింది. దీంతో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమయ్యింది’ అంటూ ఉండవల్లి శ్రీదేవి తన ఎక్స్‌(ట్విట్టర్‌)లో రాశారు. మైలవరం నుంచి టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నిరాశ తప్పలేదు. ఇక్కడ నుంచి వైసిపి నుంచి పార్టీలో చేరిన వసంత వెంకట కృష్ణప్రసాద్‌కు టిక్కెట్‌ దక్కింది. దేవినేనికి పెనమలూరు వస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ జాబితాలో కూడా సీటు దక్కకపోవడంతో దేవినేని కూడా అసంతృప్తిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో పొలంరెడ్డి దినేష్‌ రెడ్డి ముందు నుంచి నియోజకవర్గంలో కష్టపడి తిరిగారు. టికెట్‌ మాత్రం ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి కేటాయించారు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు చీపురుపల్లి నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చెప్పారు. దీనికి గంటా సుముఖత మిగతా 2లో వ్యక్తం చేయకపోవడంతో చీపురుపల్లి, భీమిలి స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. మరో మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్ల నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ మరో నేత అప్పలనాయుడు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పీతల సుజాత, జవహర్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వంటి నేతలు కూడా టికెట్లు రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు.

నేడు అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాపు
టిడిపి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్క్‌షాపు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎ వన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల ప్రచారం, సూపర్‌ సిక్స్‌ మినీ మ్యానిఫెస్టో వంటి అంశాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

➡️