నిందితులు తెలిసినా అరెస్టు చేయలేదు

Jun 11,2024 11:11 #anathapuram, #Attacks, #palanadu, #sit, #Tirupati
  • పల్నాడు, తిరుపతి, అనంతపురం ఘటనలపై సిట్‌ నివేదిక
  •  కేసులు నీరుగారే విధంగా ఎఫ్‌ఐఆర్‌లు
  • 264 పేజీలతో రెండు వ్యాల్యూములు
  • డిజిపి, ఇసి కార్యాలయానికి నివేదిక

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణల్లో నిందితులను రక్షించే విధంగా అప్పటి పోలీసు అధికారులు వ్యవహరించారని సిట్‌ నివేదిక పేర్కొంది. ఎన్నికల రోజు, అనంతరం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హింసపై ఎన్నికల సంఘం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. ప్రాథమిక విచారణ అనంతరం 267 పేజీలతో కూడిన రెండు వ్యాల్యూములను సోమవారం డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తాకు, ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ నివేదికలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో ఇవిఎంలు పగులకొట్టింది ఎవరో తెలిసినా వారి పేర్లు నమోదు చేయలేదని సిట్‌ పేర్కొంది. బిఎల్‌ఒలు కూడా వారి పేర్లతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, ఫలితంగా అగంతకులుగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. అది కూడా ఎన్నికలకు సంబంధించి కఠిన నిబంధనలు కాకుండా సర్వసాధారణ సెక్షన్లు పెట్టారని నివేదికలో తెలిపారు. పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇవిఎంను పగులకొడితే అక్కడ ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, పోలీసులూ పట్టించుకోలేదని గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారని చెప్పడంతోపాటు అసలు ఏం జరిగిందో కూడా విచారణ చేయలేదని తెలిపారు. నిందితులను కూడా ప్రశ్నించలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల నుండి వివరాలూ తీసుకోలేదని, వారికి వైద్య పరీక్షలు చేయించడం, చికిత్స నివేదికలు పొందుపరచడం వంటి అంశాలను కూడా కేసుల్లో చేర్చలేదని తెలిపారు. దీనివల్ల కేసు నీరుగారిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాడిపత్రిలో వైసిపి, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు ద్విచక్ర వాహన ర్యాలీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారని వివరించారు. ఇది 144 సెక్షన్‌కు విఘాతం కలిగేలా చేసిందని వివరించారు. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించాయని, ఈ కేసుల్లో పోలీసుల వాహనాలు ధ్వంసం చేసినా పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు ఘటనలను అసలు సీరియస్‌గా తీసుకోలేదని వివరించారు. దాడులు చేసింది ఎవరో తెలిసినా వారిని అరెస్టు చేయలేదని, నివాస ప్రాంతాల్లో దాడులు జరిగినా సాక్షులను విచారించలేదని తెలిపింది. మొత్తంగా 37 కేసులు నమోదు చేశారని, రెండు కేసుల్లో చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడే వారకూ ఎస్‌పిలు, డిఐజిలు పర్యవేక్షించాలని సిట్‌ సూచించింది. లేనిపక్షంలో కేసులు నీరుగారిపోతాయని పేర్కొంది. మొత్తంగా సిట్‌లో 11 మంది అధికారులు ప్రత్యక్ష విచారణలు జరిపి నివేదికలు తయారు చేశారు.

➡️