ఐదో దశలోనూ అంతే

May 19,2024 09:01
  • ఎన్‌డిఎ నుంచే ఎక్కువ మంది ఫిరాయింపుదారులు బరిలోకి
  • 53 శాతం బిజెపి నేతృత్వ కూటమి నుంచే
  • మహారాష్ట్ర నుంచి అధికంగా ఏడుగురు
  • శివసేన-షిండే వర్గం నుంచే ఏకంగా ఆరుగురు

న్యూఢిల్లీ : ఈనెల 20న దేశంలో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఫిరాయింపుదారులలో ఎక్కువ మంది ఎన్‌డిఎ నుంచే బరిలో ఉన్నారు. 53 శాతం మంది ఫిరాయింపుదారులు ఈ కూటమి నుంచి పోటీలో ఉన్నారు. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ)లో మొత్తం 49 స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 15 మంది ఫిరాయింపుదారులు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నుంచి ఉన్నారు. ఇక ఇండియా కూటమి నుంచి ఐదుగురు, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నుంచి, ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్‌ (బిజెడి) నుంచి ఒక్కొక్కరు చొప్పున ఫిరాయింపుదారులు పోటీలో ఉన్నారు.
ఐదో దశలో భాగంగా మహారాష్ట్రలో అత్యధికంగా ఫిరాయింపుదారులు ఉన్నారు. వీరిలో ఆరుగురు షిండే శిబిరంలో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్ల తర్వాత పార్టీ మారినవారు కాగా ఒకరు లైంగిక వేధింపుల కేసులో నిందితుడు. ఏక్‌నాథ్‌ షిండే శివసేన శిబిరంలో లోక్‌సభ టిక్కెట్‌ పొందిన నలుగురు వివాదాస్పద ఫిరాయింపుదారుల గురించి చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది.

రవీంద్ర వైకర్‌పై ఇడి కేసు
ముంబయి నార్త్‌ వెస్ట్‌ నుంచి షిండే వర్గం అభ్యర్థిగా రవీంద్ర వైకర్‌ బరిలో ఉన్నారు. జోగేశ్వరి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే, మాజీ హౌసింగ్‌, విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వైకర్‌.. 1992లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నాలుగు పర్యాయాలు బిఎంసి కార్పొరేటర్‌గా పనిచేశాడు. ఈ సంవత్సరం ఈయన శివసేన యుబిటికి చెందిన అమోల్‌ కీర్తికర్‌పై పోటీ చేస్తున్నారు. అమోల్‌ కీర్తికర్‌.. ప్రస్తుత ఎంపీ, షిండే వర్గం నాయకుడు గజానన్‌ కీర్తికర్‌ కుమారుడు.
వైకర్‌, అమోల్‌ కీర్తికర్‌ ఇద్దరిపై కూడా ఇడి వేర్వేరు కేసులు నమోదు చేసింది. వాస్తవానికి, గతేడాది నవంబర్‌లో వైకర్‌ఫై పిఎంఎల్‌ఏ కేసును ఇడి నమోదు చేసిన మూడు నెలల తర్వాత ఆయన పార్టీ ఫిరాయించారు. ఆయన రెండు ఇడి సమన్లను దాటవేసి చివరకు జనవరి చివరి నాటికి విచారణకు సహకరించాడు. మార్చిలో.. ఉద్ధవ్‌ థాక్రే ప్రచారం జరిగిన కొన్ని గంటల తర్వాత.. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు వైకర్‌ చెప్పాడు. తాను జైలుకన్నా వెళ్లాలి, లేదంటే పార్టీ అయినా మారాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

యామినీ జాదవ్‌ : భర్త-భార్యపై ఐటి, ఇడి విచారణ
ముంబయి సౌత్‌కు షిండే క్యాంపు అభ్యర్థిగా యామినీ జాదవ్‌ ఉన్నారు. బైకుల్లా నుంచి ఎమ్మెల్యే అయినా యామినా జాదవ్‌.. 2012లో బిఎంసి కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఏడేళ్ల తర్వాత ఆమె 2019లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మే 20న జరిగిన ఎన్నికల్లో ఆమె మొదటి లోక్‌సభ పోటీకి సిద్ధమవుతున్నారు. శివసేన యుబిటికి చెందిన అరవింద్‌ సావంత్‌పై ఆమె పోటీ చేస్తున్నారు.
ఆమె భర్త యశ్వంత్‌ జాదవ్‌ కూడా బిఎంసి మాజీ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌. షెల్‌ కంపెనీ ద్వారా ”హవాలా” లావాదేవీలు జరిపినందుకు 2022 ఫిబ్రవరిలో భార్యాభర్తలిద్దరినీ ఆదాయపు పన్ను(ఐటీ)శాఖ, ఇడి విచారించింది. ఆమె 2019 అఫిడవిట్‌లో ”తప్పుడు ప్రకటన” దాఖలు చేసినందుకు ఆమె ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కూడా ఐటి శాఖ సిఫారసు చేసింది. ఇప్పుడు ఈమె ఎన్‌డిఎ కూటమిలోని షిండే గ్రూపు శివసేనకు ఫిరాయించి బరిలో ఉంటున్నారు.

రాహుల్‌ షెవాలే : లైంగికదాడి కేసులో నిందితుడు
శివసేన షిండే శిబిరం నుంచి రాహుల్‌ షెవాలే ముంబయి సౌత్‌ సెంట్రల్‌ అభ్యర్థి. ఆయన 2002లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2014 వరకు నాలుగు పర్యాయాలు బిఎంసి చైర్మెన్‌గా పనిచేశారు. మధ్యలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన 2014లో ముంబయి సౌత్‌ సెంట్రల్‌ నుంచి తన మొదటి లోక్‌సభ పోరులో విజయం సాధించాడు. 2019 ఎన్నికలలో కూడా సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకున్నాడు. శివసేన విభజన జరిగినప్పుడు షిండేకు అండగా నిలిచిన మొదటి సేన నాయకులలో ఈయన ఒకడు. అయితే, ఈయనపై లైంగికదాడి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన అఫిడవిట్‌ ప్రకారం షెవాలేపై ఎలాంటి పెండింగ్‌ కేసులు లేకపోవటం గమనార్హం.

నరేష్‌ మాహ్ స్కే : థానే మాజీ మేయర్‌
మహారాష్ట్ర ముఖ్యమంత్రికి కంచుకోట అయిన థానే నుంచి షిండే క్యాంపు అభ్యర్థి నరేష్‌ మాహ్ స్కే బరిలో ఉన్నాడు. ఈయన థానే మాజీ మేయర్‌. అతను షిండేతో కలిసి పదవిని వదులుకున్నాడు. ఇప్పుడు మొదటి లోక్‌సభ టిక్కెట్‌తో బరిలో ఉన్నాడు. ఈయన శివసేన-యూబీటీ అభ్యర్థి రాజన్‌ విచారేపై పోటీ చేస్తున్నారు. కాగా, మాహ్ స్కే నామినేషన్‌, ప్రస్తుత బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ నాయక్‌కు టిక్కెట్‌ నిరాకరించడంతో 64 మంది బీజేపీ కార్పొరేటర్లు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు సహా అతని మద్దతుదారులు గత నెలలో సామూహిక రాజీనామా ప్రచారాన్ని నిర్వహించారు. వారు తమ రాజీనామాలను రాష్ట్ర బిజెపి చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాన్‌కులేకు పంపారు. ‘బిజెపికి ఓటు వేయవద్దు’ ని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కాగా, మాహ్ స్కే 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆయనకు నిర్మాణ వ్యాపారంతోపాటు రూ.26 కోట్ల ఆస్తులున్నాయి. పబ్లిక్‌ సర్వెంట్లపై క్రిమినల్‌ ఫోర్స్‌కి సంబంధించిన ఒకటి సహా అతనిపై రెండు పెండింగ్‌ క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

➡️