అక్కడంతా అధికారుల పెత్తనమే..!

May 5,2024 19:31
  •  మారని కదిరి మున్సిపల్‌ అధికారుల తీరు
  •  అవినీతి అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు
  •  ‘కారుణ్య సాయం’పై ప్రజాశక్తి కథనంతో అధికారుల్లో ఉలికిపాటు

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ : అనంతపురం జిల్లా కదిరి మున్సిపాల్టీలో కొందరు అధికారుల తీరు మారడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారనే విమర్శలు ఉన్నాయి. న్యాయబద్దంగా చేయాల్సిన పనులకు కూడా ఓ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా కొందరు అధికారుల తీరుతో కదిరి మున్సిపాల్టీపై రోజురోజుకూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాశక్తి కథనంతో అధికారుల్లో ఉలికిపాటు..!
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పట్టణ పరిశుభ్రత కోసం మున్సిపల్‌ కార్మికులు వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. ప్రజల కోసం వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవనే చెప్పాలి. కదిరి మున్సిపాల్టీలో ఇలా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో ఏడుగురు చనిపోయారు. వీరికి ప్రభుత్వం నుంచి కారుణ్య సాయం కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం అందింది. ఈ సాయం పంపిణీలో కొందరు మున్సిపల్‌ అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఒక్కో కార్మికుని నుంచి రూ.50వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ అవినీతి బాగోతంపై గత నెల 27వ తేదీన ప్రజాశక్తిలో ‘కారుణ్య సాయం మంజూరులో అధికారుల చేతివాటం’ అన్న శీర్షిక కథనం వెలువడింది. ఈ కథనం మున్సిపాల్టీలో పెద్ద ఎత్తున కలకలం రేపింది. ప్రజాశక్తిలో కథనం రాగానే అప్రమత్తమైన మున్సిపల్‌ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గత వారం ఏడుగురు కార్మికుల కుటుంబ సభ్యులను కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. డబ్బులు తీసుకున్న విషయాన్ని విలేకరులకు ఎవరు చెప్పారంటూ కార్యాలయంలోని ఓ అధికారి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము చెప్పినట్లు విధులు నిర్వహించకపోతే కష్టాలు తప్పవనే రీతిలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా కాగితంపై వేలిముద్రలు, సంతకాలు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం
తెలుసుకున్న కార్మిక సంఘం నాయకులు మున్సిపల్‌ ఉన్నత స్థాయి అధికారిని కలిసి కార్మికుల పక్షాన మాట్లాడారు. అవినీతిపై కథనం వస్తే సంబంధిత అధికారులను విచారించాల్సింది పోయి ఇలా కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయించుకోవడం ఏమిటంటూ అధికారులను నిలదీశారు. అధికారులు మాత్రం దీనికి పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అక్రమార్జనకు ప్రాధాన్యత
కదిరి మున్సిపాల్టీలో కొందరు అధికారుల అవినీతి పరాకాష్టకు చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొహిబిషన్‌ను డిక్లరేషన్‌ చేసింది. ఈ సందర్భంలో మున్సిపాల్టీలోని ఓ అధికారి ప్రొహబిషన్‌ డిక్లరేషన్‌ నిమిత్తం సంబంధిత సచివాలయ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మున్సిపాల్టీలో ఏ పనికి సంబంధించిన ఫైళ్లపై సంతకం పెట్టాలన్నా పైకం ముట్టజెబితేనే పని జరుగుతుందనే వాదన విన్పిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కదిరి కదిరి మున్సిపాల్టీలో కొత్త రకం నిబంధనలు అమలవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, ఎన్విరాన్మెంట్స్‌ సెక్రటరీలకు రాష్ట్ర హెచ్‌ఆర్‌ఎస్‌ లాగిన్‌లో సాధారణ సెలవులు ఉన్నట్లు చూపిస్తుంది. కదిరిలో మాత్రం ఆదివారం, ఇతర సెలవుదినాల్లో కూడా ఈ సిబ్బందితో పనులు చేయించుకుంటున్నారు. ఇలా కదిరి మున్సిపాల్టీలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరించి అక్రమాలకు పాల్పడుతూ పురపాలక సంఘానికి చెడ్డ పేరు తెస్తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి లోతైన విచారణ జరిపిస్తే అవినీతి అధికారుల బాగోతం బయటకు వస్తుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు.

➡️