నిలువు దోపిడే : ‘ఇండియా ఎంప్లాయ్ మెంట్‌ రిపోర్ట్‌’లో వెల్లడి

  • కార్మికులకు తీవ్ర అన్యాయం
  • కనీస వేతనమూ దక్కటం లేదు
  • దేశంలో యువతకు ఉద్యోగాలూ కష్టమే

న్యూఢిల్లీ : భారత్‌లోని కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. చేసిన పనికి తగిన వేతనం లభించటం లేదు. కనీస వేతనాలను కార్మికులకు దక్కేలా చట్టాలు చేసి, అమలు చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం దానిని పట్టించుకోవటం లేదు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌(ఐహెచ్‌డీ) ఇటీవల ఆవిష్కరించిన ఇండియా ఎంప్లారుమెంట్‌ రిపోర్ట్‌ 2024 ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 60 శాతం మంది సాధారణ కార్మికులు తమకు రావాల్సిన కనీస వేతనానికీ నోచుకోలేకపోతున్నారు. ”సాధారణ వ్యవసాయ కార్మికులలో 62 శాతం మంది, నిర్మాణ రంగంలో 70 శాతం మంది కార్మికులు 2022లో నిర్దేశించిన రోజువారీ కనీస వేతనాలను పొందలేదు” అని నివేదిక పేర్కొన్నది.
ఈ నివేదికలో కీలకంగా వ్యవహరించిన లేబర్‌ ఎకనామిస్ట్‌ రవి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఒప్పందం చేసుకున్న నైపుణ్యం లేని కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ, వేతన దోపిడీని ఎత్తి చూపారు. కాంట్రాక్టర్లు.. కార్మికుల సంపాదనలో కొంత భాగాన్ని లాగేసుకోవటంతో కనీస వేతనం కూడా వారికి అందకుండా పోతున్నదని చెప్పారు. ”నా భార్య కిరాణా షాపులో సేల్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నది. మా మొత్తం సంపాదన నెలకు రూ. 20,000 కంటే తక్కువ. అద్దెకు ఉంటున్నాం. మేము జీవితాన్ని అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాం”అని ఢిల్లీలో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డు చెప్పాడు.
నివేదిక ప్రకారం.. 2019 తర్వాత అధిక ఉత్పాదకత తయారీ, సేవా రంగాలలో తగినంత ఉద్యోగ కల్పన జరగకపోవటంతో నాణ్యమైన ఉద్యోగాల కొరత ఉన్నది. 2000-2019 మధ్య, తక్కువ ఉత్పాదకత కలిగిన వ్యవసాయం నుంచి సాపేక్షంగా అధిక ఉత్పాదకత కలిగిన వ్యవసాయేతర రంగాలకు ఉపాధిలో తిరోగమనం కనిపించింది. మహమ్మారి సంబంధిత ఆర్థిక మందగమనంతో వ్యవసాయ రంగం కాని సెక్టార్లలో పని అవకాశాలు లేకపోవటంతో.. వారు వ్యవసాయంలో జీవనాధార కార్యకలాపాలకు తిరిగి రావటమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నది.
”పలు సర్వేలు యువతలో నైపుణ్యాలు లేవని, ఉపాధి పొందటం లేదని చెప్పాయి. మేము ఆ సమస్యను కూడా విశ్లేషించాము. దేశంలో తగిన నాణ్యతతో తగినంత ఉద్యోగాలు సృష్టించబడటంలేదు” అని శ్రీవాస్తవ అన్నారు. ”అత్యున్నత స్థాయి విద్య ఉన్న యువతలో మెరుగైన నాణ్యమైన ఉద్యోగాలు కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ ఉద్యోగ కల్పన అనేది వారి విద్య, నైపుణ్యం కంటే తక్కువ ప్రమాణాలతో ఉండటం వంటి వివిధ కారణాలతోనూ విద్యావంతులైన యువకులలో అధిక భాగం నిరుద్యోగులుగా మిగిలిపోయారు”అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఇలా వెలువడుతున్న పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనాలని విద్యావేత్తలు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

➡️