డెయిరీ కాలుష్యంతో ప్రజల అవస్థలు

Apr 27,2024 10:26 #dairy contamination

– పలువురు కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతం
-30 వేల మందిపై తీవ్ర ప్రభావం
– సొంతిళ్లను సైతం వదిలిపోతున్న పరిసర వాసులు
– నోరెత్తని టిడిపి, వైసిపి
– కాలుష్య నియంత్రణకు ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం
విశాఖ డెయిరీ కాలుష్యం గాజువాక నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందల మంది కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు ఆ విషయాన్నే విస్మరించడంతో కాలుష్య సమస్య ప్రజల ప్రాణాలు తీస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో సిపిఎం మాత్రమే ప్రజల పక్షాన కాలుష్య సమస్యపై పోరాడుతోంది.
ప్రజాశక్తి -గాజువాక
సమీకృత ఆహారం పాలు.. పాలు, పాల పదార్థాలను తింటే ఆరోగ్యానికి మంచిదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పాలను ప్యాకెట్లలో నిల్వ ఉంచేందుకు, వివిధ ఆహార పదార్థాలుగా మార్చేందుకు నిర్వహించే ప్రాసెసింగ్‌ ప్రక్రియలో వెలువడే నీటి, వాయు కాలుష్యంతో డెయిరీ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల వాసులు నానా అవస్థలకు, అనారోగ్య సమస్యలకు గురవుతూ ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సొంతిళ్లను సైతం వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి అద్దెకు ఉంటున్నారంటే ఇక్కడ ఎంతగా కాలుష్యం వెలువడుతుందో ఇట్టే అర్థమౌతుంది. విశాఖ డెయిరీ కాలుష్యంతో జనం పడుతున్న ఇక్కట్లును దాని యాజమాన్యంగానీ, ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో జివిఎంసి 68వ వార్డులో దాదాపు 30 ఏళ్ల క్రితం విశాఖ డెయిరీని నెలకొల్పారు. మొదట్లో వేల నుంచి లక్ష లీటర్ల వరకు పాల సేకరణ చేపట్టి, వాటిని ప్రాసెసింగ్‌ చేసేవారు. అయితే అప్పట్లో అంతగా కాలుష్యం వెలువడేది కాదు. కాలక్రమేణా విశాఖ డెయిరీ ప్లాంట్‌ విస్తరణ చేపడుతూ నేడు రోజుకు 9 లక్షల లీటర్ల వరకుపాలను సేకరిస్తోంది. ఈ పాల ప్రాసెసింగ్‌ ప్రక్రియలో భాగంగా 75 డిగ్రీల సెంటిగ్రేట్‌ వద్ద వీటిని వేడి చేయాలి. దీనికోసం రెండు బొగ్గు బాయిలర్లు, మరో రెండు ఫర్నెస్‌ ఆయిల్‌తో నడిచే బాయిలర్స్‌ను నెలకొల్పారు.
ఆయిల్‌ ధర ఎక్కువగా ఉండడంతో సంబంధిత బాయిలర్స్‌ నిర్వహణా వ్యయం ఎక్కువ కావడంతో ఎక్కువగా బొగ్గు బాయిలర్స్‌పైనే ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. దీనికోసం రోజుకు టన్నున్నర వరకు బొగ్గు అవసరమౌతున్నట్లు సమాచారం. దీంతో నాణ్యమైన బొగ్గు ధర, సేకరణ కొంత భారంతో కూడుకుని ఉండడంతో నాసిరకం బొగ్గును కొనుగోలు చేసి వాడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఉదయంపూట బొగ్గు బాయిలర్స్‌ను వినియోగించడంతో వెలువడే పొగ, కాలుష్యం వల్ల ఇబ్బందులు పడ్డ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు పెరగడంతో, ఇప్పుడు రాత్రి సమయంలో బొగ్గును వినియోగిస్తున్నారు.
నాసిరకం బొగ్గుతో తీవ్రమైన దుమ్ము, పొగ కాలుష్యం
పాల ప్రాసెసింగ్‌ చేసే బాయిలర్స్‌లో నాసిరకం బొగ్గును వినియోగించడం వల్ల, విపరీతమైన దుమ్ము చెలరేగి, పరిసర అక్కిరెడ్డిపాలెం, సింగపూర్‌ కాలనీ, రాంనగర్‌, పంచవటి కాలనీ, మింది తదితర ప్రాంతాల్లో బొగ్గు ధూళి జనాలను ఇబ్బందుకు గురిచేస్తోంది. మరోవైపు పొగ కాలుష్యంతో వాటిని పీల్చిన జనాలు అనారోగ్యం పాలౌతున్నారు. ఊపిరితిత్తులు కేన్సర్‌, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోపాటు కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికలు ఆవేదన చెందుతున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఇద్దరు మహిళలు మృతి చెందారని, ఇంకా ఎందరో అస్వస్థతకు గురై అవస్థలు పడుతున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు.
వ్యర్థజలాలతో భూగర్భం విషతుల్యం
డెయిరీలో సేకరించిన పాలను వేడి చేయడానికి ఎస్‌ఎస్‌ పైప్‌లైన్స్‌ కూడా ఉపయోగిస్తారు. ప్రాసెసింగ్‌ తర్వాత ఆ పైప్‌లైన్లు శుభ్రం చేయడానికి కాస్టిక్‌ సోడా, సిట్రిక్‌ యాసిడ్‌ను వినియోగిస్తుండడంతో తర్వాత వచ్చే వ్యర్థజలాలను డెయిరీ వెనక భాగంలో ఉన్న కాలువలోని చిన్న రంధ్రం ద్వారా దొడ్డిదారిన విడిచిపెడుతున్నారు. ఈ కాలువ అక్కిరెడ్డిపాలెం మీదుగా పంచవటి వరకు ప్రవహిస్తుడడంతో దీని ప్రభావంతో అక్కిరెడ్డిపాలెం, సింగపూర్‌ కాలనీ, పంచవటి కాలనీ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని స్థానికులు వాపోతున్నారు. ఒకప్పుడు తాగడానికి వాడిన ఈ ప్రాంత జలాలను ఇపుడు బట్టలు ఉతుక్కోవడానికి కూడా పనికి రానంతగా కాలుష్యమయం అయ్యాయంటే, ఎంతగా ఇక్కడ భూగర్భం విషతుల్యమైందో అవగతం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తాగడానికి, వంటకు నీటిని కొనుక్కోక తప్పని పరిస్థితులున్నాయి. అంతేకాక ఈ వ్యర్థజలాలు, పొగ కాలుష్యంతో తీవ్రమైన దుర్వాసన వెలువడి రాత్రి వేళల్లో వాటి గాఢత వల్ల నిద్ర కూడా పట్టడం లేదని విశాఖ డెయిరీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముక్కుపుటాలను అదరగొట్టే దుర్వాసన తమను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ప్రజల గోడు పట్టని ప్రజాప్రతినిధులు, పాలకులు
విశాఖ డెయిరీ కాలుష్య సమస్యపై నాటి ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి నుండినేటి ఎమ్మెల్యే నాగిరెడ్డి వరకు మొత్తంగా టిడిపి, వైసిపిలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మారినప్పటికీ, డెయిరీ కాలుష్యంపై వీరెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయా పార్టీలు అపుడు, ఇపుడు, ఎప్పుడూ డెయిరీ యాజమాన్యానికి వత్తాసు పలికేలా వ్యవహరించాయే తప్ప, ప్రజల పక్షాన ఆలోచించిన పాపాన పోలేదు.
అసెంబ్లీలో ప్రస్తావించిన నాటి సిపిఎం ఎమ్మెల్యే గఫూర్‌
విశాఖ డెయిరీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు పడుతున్న కష్టాలపై రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిపిఎం ఎమ్మెల్యే గఫూర్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 2005లో ప్రభుత్వం నియమించిన శాసనసభా కమిటీ విశాఖ డెయిరీని సందర్శించి, కాలుష్యంపై నిర్థారణకు వచ్చింది.
డెయిరీ వ్యర్థజలాలను నిల్వ ఉంచడం గానీ, బయట కాలువల్లోకి విడిచిపెట్టకుండా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేసి, నేరుగా సముద్రంలోకి వెళ్లేలా చూడాలని అప్పట్లో శాసన సభ కమిటీ సిఫార్సు చేసింది. అయితే కమిటీ సూచనలను యాజమాన్యం పెడచెవిన పెట్టింది. తర్వాత సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఆందోళనల ఫలితంగా ఉదయం పూట బొగ్గు బాయిలర్ల వాడకం తగ్గించి మభ్యపెట్టేలా డెయిరీ యాజమాన్యం వ్యవహరించిందే తప్ప, అసలు సమస్య పరిష్కరానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలు చేపట్టిన సిపిఎం, ప్రజాసంఘాలు
విశాఖ డెయిరీ కాలుష్యంతో సుమారు 30 వేల మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సిపిఎం మాత్రమే పాదయాత్రలు పోరాటాలు, ధర్నాలు, ఇతరత్రా ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా డెయిరీ యాజమాన్యం ప్రోద్బలంతో పోలీసుల ఆందోళన చేసిన సిపిఎం శ్రేణులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజల పక్షాన సిపిఎం మాత్రమే పోరాటాలు చేసిన విషయాన్ని ఇప్పటికీ ఇక్కడి వారు గుర్తుచేసుకుంటారు.

➡️