ఖరీఫ్‌ బీమా ఎప్పుడు ?

Mar 29,2024 10:59 #Kharif Insurance
  • కరువు, తుపాన్‌ వలన భారీగా పంట నష్టం
  • 2022 రబీ ఇన్సూరెన్స్‌ దిక్కులేదు
  • 2023 రబీలో ప్రక్రియే మొదలు కాలేదు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులతో పంట నష్టం వాటిల్లిన రైతులకు బీమా ప్రశ్నార్ధకమైంది. గతేడాది రబీ సీజన్‌లో వైపరీత్యాల వలన పంటలు దెబ్బతిన్న అన్నదాతలకు ఇప్పటికీ ఇన్సూరెన్స్‌ సొమ్ము అందలేదు. 2023 ఖరీఫ్‌లో కరువు, తుపాన్లతో పంటలు నష్టపోగా బీమా ఊసే లేదు. అదేంటంటే, ఎన్నికల అనంతరం జూన్‌లో క్లెయిములొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రస్తుత 2023-24 రబీ సాగు ముగిసినా బీమా ప్రక్రియ మొదలు కాలేదు. కేంద్రానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. జరుగుతున్న రబీలో కరువు తీవ్ర రూపం దాల్చింది. లక్షల ఎకరాల్లో సాగు లేదు. వేసిన పంటలు ఎండుతున్నాయి. రైతుల్లో ధీమా నింపాల్సిన బీమా సందేహాస్పదం కావడంతో ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోయిన తరుణంలో అరకొరగా ఇచ్చే బీమా అయినా దక్కేనా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

దీమా లేదు
రైతులందరికీ ఉచిత పంటల బీమా అమలు చేస్తామని నవరత్నాల్లో వైసిపి సర్కారు హామీ ఇవ్వగా అరకొరగా తప్ప నాలుగేళ్లల్లో ఎప్పుడూ అన్నదాతలకు సరిగ్గా బీమా దక్కింది లేదు. తొలుత కంపెనీలతో సంబంధం లేకుండా, కేంద్ర పథకాలతో నిమిత్తం లేకుండా బీమా అన్నారు. కేంద్రం ఒత్తిడితో 2022 నుంచి తిరిగి సెంటర్‌ పథకాల్లో చేరారు. ఆ ఏడాది ఖరీఫ్‌లో దిగుబడి ఆధారిత బీమా (ఫసల్‌)ను కంపెనీలకు అప్పగించగా, వాతావరణ ఆధారిత బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 2022 ఖరీఫ్‌ క్లెయిములు 2023 మధ్యలో రైతులకు వచ్చాయి. అవీ అరకొరగానే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్‌ కోసం చెల్లించిన ప్రీమియంలో పట్టుమని సగం కూడా రైతులకు ఇన్సూరెన్స్‌ అందలేదు. వాతావరణ ఆధారిత బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తానే కొంతవరకు చెల్లించింది. 2022-23 రబీలో పంటలు నష్టపోయినా రైతులకు ఇప్పటి వరకు ఫసల్‌, వాతావరణ బీమా ఇవ్వలేదు.

కేంద్రం నిధుల విదిలింపు
2023-24 కు వచ్చేసరికి ఫసల్‌, వాతావరణ రెండింటినీ కంపెనీలకు అప్పగించారు. ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సుమారు రూ.557 కోట్ల ప్రీమియం కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం 390 కోట్లు చెల్లించగా, అంతే మొత్తంలో కేంద్రం చెల్లించాల్సి ఉండగా 95 కోట్లే బదిలీ చేసింది. అదనంగా రాష్ట్రం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 71 కోట్లు కూడా చెల్లించింది. ఉచిత బీమా అన్నందున రైతుల వాటా ప్రీమియం కూడా జమ చేసింది. సీజన్‌లో 50 లక్షల ఎకరాలకు ఫసల్‌ బీమా చేశారు. ఖరీఫ్‌లో వాతావరణ బీమాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.628 కోట్లు కట్టాయి. రాష్ట్రం 428 కోట్లు కట్టగా కేంద్రం 179 కోట్లు ఇచ్చింది. అదనంగా రైతుల తరఫున రాష్ట్ర సర్కారు 28 కోట్లు కట్టింది. వాతావరణ బీమా 18 లక్షల ఎకరాలకు చేశారు. ఖరీఫ్‌లో కరువు, మిచౌంగ్‌ తుపాను వలన లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం 103 కరువు మండలాలను ప్రకటించి వాటిలో జరిగిన పంట నష్టాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మార్చిలో ఇచ్చింది. బీమాకు కరువు మండలాల ప్రకటనలతో సంబంధం లేదు. ఇ-క్రాప్‌లో ఎక్కితే సరిపోతుంది. ఆ లెక్కన ఇన్‌పుట్‌ కంటే ఎక్కువ విస్తీర్ణానికి బీమా రావాలి. మిచౌంగ్‌ తుపాన్‌కూ పంటలు దెబ్బతిన్నాయి. కానీ ఖరీఫ్‌ బీమా ఎప్పుడొస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. జూన్‌లో వస్తుందని అంచనా వేస్తున్నారు. 2023-24 రబీలో ఇంకా బీమా ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2022-23 రబీ బీమాయే లేదు. ప్రస్తుత రబీ బీమా ఎప్పటికి వస్తుందో, అసలు వస్తుందో లేదో అనుమానమే. కాగా రబీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కరువుంది. ప్రభుత్వం 87 మండలాలనే ప్రకటించింది.

➡️