ఎడారి రాష్ట్రం ఎటు!

  • పాచికలతో బిజెపి
  • కలివిడిగా కాంగ్రెస్‌
  •  తొలిదశ ఎన్నికలకు పార్టీల మోహరింపు

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌… ఈ ఏడారి రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి, కాంగ్రెస్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. బిజెపి కుల, విభజన పాచికతో ఎన్నికలకు వెళ్తుండగా, కాంగ్రెస్‌, ఇండియా ఫోరం పార్టీలు రైతుల సమస్యలు, ఉపాధి, ధరల పెరుగుదల, ఆదివాసీ హక్కులు, దళితులపై దాడులు వంటి అంశాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దేశంలోనే అత్యంత ఎక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో 28.5 శాతంతో రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారింది. రాజస్థాన్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్‌ 19, ఏప్రిల్‌ 26 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. 12 స్థానాలకు తొలి దశలో, 13 స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ జరగనుంది.
కమలానికి అన్ని సీట్లు అసాధ్యం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో బిజెపి లోక్‌సభ ఎన్నికలకు వెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెచ్చుకున్నన్ని సీట్లు మళ్లీ ఆసిస్తోంది. గత ఎన్నికల్లో 25 స్థానాలకు 24 బిజెపి, ఎన్‌డిఎ పార్టీ ఆర్‌ఎల్‌పి 1 స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేశారు. రామమందిరం, కుల సమీకరణాలతో ఎన్నికలకు వెళ్తున్న బిజెపికి గత ఎన్నికల ఫలితాలు రాకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ ఘోరంగా విఫలం అయింది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత లోక్‌సభ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్‌, ఇండియా ఫోరంలో భాగంగా ఉన్న సిపిఎం, ఆర్‌ఎల్‌పి, బిఎపి పార్టీలతో కలిసి చేస్తోంది. రాజస్థాన్‌లో ఇండియా ఫోరం బలోపేతం అయింది. ఫోరానికి సానుకూల ఫలితాలు తెచ్చే పరిణామం ఇది.
ఎవరు ఎన్ని స్థానాల్లో..
రెండు దశల నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో బిజెపి 25 స్థానాల్లో పోటీ చేయగా, ఇండియా ఫోరంలో భాగంగా కాంగ్రెస్‌ 22, సిపిఎం 1, ఆర్‌ఎల్‌పి 1, బిఎపి 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి. 2019లో ఎన్‌డిఎలో ఉన్న ఆర్‌ఎల్‌పి, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా ఫోరం తరపున ఆ పార్టీ బరిలోకి దిగింది.
సం’కుల’ సమరం
1993 నుండి, రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకు బిజెపి, కాంగ్రెస్‌ మధ్య అధికారం మారుతూ వస్తోంది. ఈ కాలంలో కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ మూడుసార్లు, బిజెపికి చెందిన వసుంధర రాజే రెండుసార్లు సిఎంగా ఉన్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి వసుంధర రాజేను కాదని, ఆమె స్థానంలో భజన్‌లాల్‌ శర్మను ముఖ్యమంత్రిని చేశారు. దీంతో బిజెపిలో అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయి. జాట్‌, రాజ్‌పుత్‌, బ్రహ్మణ వంటి అగ్రవర్ణాలు, గుజ్జర్‌, యాదవ్‌, సంఘీ వంటి వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలు, మీనా వంటి షెడ్యూల్‌ తెగలు, ఎస్‌సి ఓటర్లు ఉన్నారు. జాట్లు రాజకీయాలను శాసిస్తారు. అందుకే ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌ ఆ సామాజిక వర్గానికే పగ్గాలు అప్పగిస్తాయి. జాట్‌ సామాజిక వర్గానికి చెందిన సతీష్‌ పునియా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, గోవింద దోస్టార కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే 2023 మార్చిలో బిజెపి సతీష్‌ పునియాను తొలగించి మరో అగ్రవర్ణానికి చెందిన సిపి జోషికి పార్టీ పగ్గాలు అందించింది. జాట్‌కు చెందిన జగదీప్‌ ధన్‌ఖర్‌ను బిజెపి ఉపరాష్ట్రపతి చేసింది. రాజస్థాన్‌ రాజకీయాలపై గుజ్జర్లు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా గుజ్జర్లు కాంగ్రెస్‌కి మద్దతుగా ఉంటారు. అయితే గుజ్జర్‌ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ సచిన్‌ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గుజ్జర్లు బిజెపికి ఓటు వేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గుజ్జర్లు మళ్లీ కాంగ్రెస్‌ వైపు వచ్చారు. అగ్ర వర్ణాల ఓటర్లు 18-20 శాతం ఉంటారు. ఒబిసిలు 45-50 శాతం ఉంటారు. రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని సామాజిక తరగతుల ప్రభావం ఉంటుంది.
అటు ఇటయ్యారు
చురు సిట్టింగ్‌ ఎంపి రాహుల్‌ కస్వాన్‌కు బిజెపి టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ఆయనకు చురు టిక్కెట్టు ఇచ్చింది. ఇప్పుడు బిజెపి నుంచి పారాలింపిక్‌ ప్లేయర్‌ దేవేంద్ర ఝఝరియాను పోటీ చేస్తున్నారు. సొంత పార్టీపైనే రాహుల్‌ కస్వాన్‌ పోటీ చేస్తున్నారు. కోటాలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రహ్లాద్‌ గుంజాల్‌ ను నిలబెట్టారు. గుంజాల్‌ ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా సొంత పార్టీపైనే పోటీ చేస్తున్నారు. దుంగార్‌పూర్‌-బన్‌స్వారా సీటులో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేంద్రజిత్‌ మాల్వియాతో కాంగ్రెస్‌ తలపడుతోంది. మాల్వ్య కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడంతో బిజెపి ఆయనను అభ్యర్థిగా నిలిపింది.
బరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు
అల్వార్‌ నుంచి ఎమ్మెల్యే లలిత్‌ యాదవ్‌, దౌసా నుంచి మురారీ లాల్‌ మీనా, జుంజును నుంచి బ్రిజేంద్ర ఓలా బరిలోకి దిగారు. నాగౌర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్‌ఎల్‌పి ఎమ్మెల్యే హనుమాన్‌ బెనివాల్‌, బన్స్వారా స్థానం నుంచి బిఎపి ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రోట్‌ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే రవీంద్ర భాటి కూడా బార్మర్‌-జైసల్మేర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ముక్కోణపు పోటీ
బార్మర్‌ లోక్‌సభ స్థానానికి బిజెపి కేంద్రమంత్రి కైలాష్‌ చౌదరి, కాంగ్రెస్‌ నుంచి ఉమేరామ్‌ బనివాల్‌, స్వతంత్ర ఎమ్మెల్యే రవీంద్ర సింగ్‌ భాటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి, కాంగ్రెస్‌ అభ్యర్థులకు సవాల్‌ విసిరారు. దుంగార్‌పూర్‌-బన్స్వారాలో బిజెపి తన అభ్యర్థిగా కాంగ్రెస్‌ మాజీ మంత్రి మహేంద్రజిత్‌ సింగ్‌ మాల్వియాను బరిలోకి దించగా, కాంగ్రెస్‌ అరవింద్‌ దామోర్‌కు టికెట్‌ ఇచ్చింది. బిఎపి ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రోట్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా ముక్కోణపు పోటీ జరుగుతుంది.

➡️