ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి…

Apr 17,2024 03:30 #Case, #Dalit, #Thota Trimurthulu, #YCP
  • తప్పించుకునేందుకు కప్పదాట్లు
  •  తోట త్రిమూర్తులుకు నాడు టిడిపి అండ
  •  నేడు వైసిపి సర్కారులో ఎంఎల్‌సి పదవి, మండపేట టికెట్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : శిరోముండనం కేసు నుంచి తప్పించుకునేందుకు తోట త్రిమూర్తులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పదవులను అనుభవిస్తూ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది. నాడు ఆయన ఎంఎల్‌ఎగా ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన నాటి టిడిపి సర్కారు అందుకు విరుద్ధంగా తోటకు కొమ్ముకాసింది. కేసును ఎత్తివేస్తూ ఏకంగా జిఒ జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమించారు. అప్పటి న్యాయవాది బొజ్జా తారకం బాధితుల పక్షాన హైకోర్టులో రిట్‌ వేశారు. ప్రభుత్వ జిఒను రద్దు చేయించారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. పదేళ్ల పాటు సాగిన కాంగ్రెస్‌ పాలనలో బాధితుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పిపి)ని నియమించింది. కేసు వేగం పుంజుకుంది. మళ్లీ టిడిపి ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన పిపిని తొలగించింది. బాధితులు, దళిత సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కేసు కోర్టులో ఉండగా అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఎంఎల్‌ఎగా ఉన్న తోట త్రిమూర్తులు సర్కారు సాయంతో మరో పిపిని నియమించేలా పలుకుబడిని ఉపయోగిం చారు. తదనంతరం వైసిపి సర్కారు వచ్చింది. వచ్చిన నెలలోనే శిరోముండనం బాధితులకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చి త్రిమూర్తులును తనవైపు తిప్పుకుంది. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఎంఎల్‌సి పదవి కూడా ఇచ్చింది. ప్రస్తుతం త్రిమూర్తులుకు మండపేట ఎమ్మెల్యే టికెట్‌ను వైసిపి ఇచ్చి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో వైసిపి సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

➡️