పింఛన్‌దారులకు ‘చేయూత’ కట్‌

ysr cheyuta cut to pensioners
  • కొత్త వారికి హ్యాండిచ్చిన సర్కారు 
  • లక్షల మందిఅక్కచెల్లెమ్మలు ఘొల్లు 
  • ఒంటరి మహిళలు, వితంతువులే సమిధలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఈ తడవ ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ పథకానికి ప్రభుత్వం భారీగా కత్తెర పెట్టింది. ఇప్పటి వరకు ఈ స్కీంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి కూడా లబ్ధి చేకూర్చగా, కొత్తగా పెట్టుకున్న చేయూత దరఖాస్తుల్లో పెన్షన్‌దారులను తొలగించారు. పెన్షన్‌ పొందుతున్న మహిళలను అనర్హులుగా పేర్కొన్నారు. చేయూత సహాయం కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టుకొని కొన్ని నెలలుగా కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న లక్షల మంది ‘అక్కచెల్లెమ్మల’ ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. ఫిబ్రవరి మొదటి వారంలో చేయూత లబ్ధిదారులకు సొమ్ము విడుదల చేస్తూ ముఖ్యమంత్రి బటన్‌ నొక్కాక వారం రోజులపాటు పండగలా చేయాలని యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చిన తరుణంలో ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఒక్కడా ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఫ్రెషర్స్‌కే తిరస్కరణ

45 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, పేద మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లల్లో రూ.75 వేల ఆర్థిక సాయం చేసే పథకం చేయూత. తొలుత 2020లో ఈ స్కీం అమలుకు సర్కారు జారీ చేసిన జీవో, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌లో ‘వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక’ లబ్ధిదారులను మినహాయించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిబంధనలను సడలించి వారిక్కూడా అమలు చేశారు. కాగా 2023 జులై, ఆగస్టు నుంచే వలంటీర్లు తమ పరిధిలోకొచ్చే, కొత్తగా 45 సంవత్సరాలు నిండిన మహిళలతో దరఖాస్తులు పెట్టించారు. తీరా కొత్తగా చేయూతకు దరఖాస్తు చేసుకున్న వారిలో పింఛన్‌దారులకు లేదని, పథకానికి అనర్హులని వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఘొల్లుమంటున్నారు. చేయూత కోసం ఎదురు చూస్తున్నవారందరూ ఒంటరి మహిళ, వితంతు పింఛన్‌దారులే.

‘జగనన్నకు చెప్పుకున్నా’ అంతే!

అర్హులై ఉండి, సంక్షేమ పథకాలు రాని వారి కోసం ‘జగనన్నకు చెప్పుకుందాం’ పేరిట ‘1902’ నెంబర్‌తో కాల్‌ సెంటర్‌ను సర్కారు నడుపుతోంది. ఈ నెంబర్‌కు కాల్‌ చేస్తే కొత్త లబ్ధిదారుల్లో పింఛన్‌ పొందుతున్నట్లయితే అనర్హులని సమాధానమిసు ్తన్నారు. ఇదే సమయంలో గతంలో చేయూత అందుకున్న వారిలో పింఛన్‌దారులు ఈసారి కూడా అర్హులేనంటున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, వెలుగు, ఎండిఒ, ఇతర అధికారులందరిదీ ఇదే మాట. కాగా సెర్ప్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాత్రం అటువంటిదేమీ లేదని చెపుతున్నారు. దీంతో చేయూత ఆశావహ మహిళలు గందరగోళంలో పడ్డారు. లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి, ఆ మేరకు నిధులు మిగుల్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

➡️