అన్మోల్‌, అస్మిత సంచలనం-జపాన్‌పై 3-2తో గెలుపు

Feb 17,2024 22:05 #Sports

ఫైనల్లో థాయ్ లాండ్‌తోఢీ

కౌలాలంపూర్‌: మలేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా షట్లర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. క్వార్టర్‌ ఫైనల్లో హాంకాంగ్‌ను చిత్తు చేసిన షట్లర్లు సెమీఫైనల్లోనూ అదే ప్రదర్శనను కొనసాగించారు. దాంతో తొలిసారి ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్లోకి అడగు పెట్టి చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన సెమీస్‌ తొలి సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పివి సింధు 13-21, 20-22తో అయా ఒహోరి(జపాన్‌) చేతిలో వరుససెట్లలో ఓడింది. ఆ తర్వాత మహిళల డబుల్స్‌లో గాయత్రి-త్రీసా జోలీ 21-17, 16-21, 22-20తో 73నిమిషాల్లో 6వ ర్యాంకర్‌ మత్సుయామా-చిహారి షిడాలను చిత్తుచేయడంతో స్కోర్‌ 1-1తో సమమైంది. ఆ తర్వాత సింగిల్స్‌లో అస్మిత ఛాలిహా పెను సంచలనం నమోదు చేసింది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌, 20వ ర్యాంకర్‌ నజోమి ఒకుహరాపై 21-17, 21-14తో నెగ్గడంతో భారత్‌ 2-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో మహిళల రెండో డబుల్స్‌లో తానీషా కాస్ట్రో గాయపడడంతో అశ్విని పొన్నప్పతో జతకట్టిన సింధు ఆ మ్యాచ్‌ను 14-21, 13-2తో కేవలం 43నిమిషాల్లోనే చేజార్చుకున్నారు. దీంతో స్కోర్‌ 2-2తో సమమైంది. చివరి సింగిల్స్‌లో యువ షట్లర్‌ 17ఏళ్ల అన్మోల్‌ కర్బ్‌ పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఏకంగా 29వ ర్యాంకర్‌ నట్సుకి నిడైర్‌ను 21-18, 21-18తో కేవలం 52నివిషాల్లో చిత్తుచేసి భారత్‌ను తొలిసారి ఫైనల్లోకి చేర్చింది. దాంతో, ఈసారి కనీసం రజత పతకం ఖాయం కానుంది. ఆదివారం జరిగే ఫైనల్లో థాయ్ లాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు 2016, 2020లలో కాంస్య పతకాలను మాత్రమే చేజిక్కించుకుంది.

➡️