ఆదుకున్న జురెల్‌, అశ్విన్‌

Feb 16,2024 22:30 #Sports

– భారత్‌ 445ఆలౌట్‌ – డకెట్‌ సెంచరీ, ఇంగ్లండ్‌ 207/2

రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్ర వికెట్‌ కీపర్‌ ధృవ్‌ జురెల్‌, అశ్విన్‌ బ్యాటింగ్‌లో రాణించడంతో భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ విధ్వంసకర సెంచరీతో ఇంగ్లండ్‌ పటిష్ఠ స్థితిలో నిలిచింది. మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలీ 15 పరుగులకే అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగినా… బెన్‌ డకెట్‌ టీమిండియా బౌలింగ్‌ను సమర్ధవంతం ఎదుర్కొన్నాడు. డకెట్‌ 118బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 21ఫోర్లు, 2సిక్సులు ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజ్‌లో బెన్‌ డకెట్‌, జో రూట్‌(9) ఉన్నారు. ఓలీ పోప్‌ 39పరుగులు చేసి సిరాజ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 326పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ను యువ వికెట్‌ కీపర్‌ జురెల్‌(46; 104బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు), అశ్విన్‌(37; 89బంతుల్లో 6ఫోర్లు) ఆదుకున్నారు. ఆ తర్వాత వైస్‌ కెప్టెన్‌ బుమ్రా(26) కూడా పరుగులు రాబట్టడంతో భారత్‌ గౌరవప్రద స్కోర్‌కు చేరుకోగల్గింది. ఇంగ్లండ్‌ బౌలర్లు మార్క్‌ వుడ్‌కు నాలుగు, రెహాన్‌ అహ్మద్‌కు రెండు, ఆండర్సన్‌, హార్ట్‌లీ, రూట్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

భారత్‌కు 5పరుగుల పెనాల్టీ

భారతజట్టు 5పరుగుల పెనాల్టీని సమర్పించుకొంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాటర్‌ పిచ్‌ మధ్యలోని ‘రక్షిత ప్రాంతం’లో పరుగు తీస్తే.. ఇలా పెనాల్టీ పరుగులను సమర్పించుకోవాల్సి వస్తుంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇలా చేయడంతో అది గుర్తించిన ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు రోహిత్‌ సేనకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. ఫలితంగా ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ఇంగ్లండ్‌కు 5 పరుగులు వచ్చాయి. 102వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ రెహన్‌ అహ్మద్‌ వేసిన బంతిని అశ్విన్‌ ఆఫ్‌-సైడ్‌లో ఆడి సింగిల్‌ కోసం పరిగెత్తాడు. ఆ సమయంలో పిచ్‌పైన ఉన్న ‘ప్రొటెక్టెడ్‌ ఏరియా’లో రెండు మూడు అడుగులు వేసి.. వెంటనే దూరంగా వెళ్లాడు. అయితే, అంపైర్‌.. అశ్విన్‌ చర్యను గుర్తించి భారత జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు విధిస్తున్నట్లు సిగల్‌ ఇచ్చాడు. దీని గురించి అశ్విని అంపైర్‌తో చర్చించినా ఫలితం లేకపోయింది.

500వికెట్ల క్లబ్‌లో అశ్విన్‌రెండో భారత బౌలర్‌గా రికార్డు

భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలేను ఔట్‌ చేసిన అశ్విన్‌.. 500వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, ఈ ఫీట్‌ సాధించిన భారత 2వ, ఓవరాల్‌గా తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 89 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో లెగ్‌ స్టంప్స్‌ వైపు పడిన బంతిని క్రాలే(15) స్వీప్‌ షాట్‌ ఆడాడు. ఫైన్‌ లెగ్‌లో ఉన్న రజత్‌ పాటిదార్‌ వెనక్కి పరుగెత్తి మరీ అద్భుత క్యాచ్‌ పట్టాడు. దాంతో, అశ్విన్‌ ఖాతాలో 500వ వికెట్‌ చేరింది. భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే తర్వాత ఈ ఘనతకు చేరువైన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు తక్కువ బంతుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ మాత్రమే. అశ్విన్‌ 25,714 బంతుల్లో ఐదొందల వికెట్లు తీయగా.. ఆస్ట్రేలియా వెటరన్‌ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 22,528 బంతుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. తక్కువ టెస్టుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు. శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ 87 మ్యాచుల్లో ఐదొందల వికెట్లు తీయగా.. అశ్విన్‌ 98 టెస్టుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. భారత్‌కే చెందిన అనిల్‌ కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు…

1. అనిల్‌ కుంబ్లే : 619(236ఇన్నింగ్స్‌)

2. రవిచంద్రన్‌ అశ్విన్‌ : 500(184 ,, )

3. కపిల్‌ దేవ్‌ : 434(227 ,, )

4. హర్భజన్‌ సింగ్‌ : 417(190 ,, )

5. ఇషాంత్‌ శర్మ : 311(188 ,, )

టెస్టుల్లో వేగంగా 500వికెట్లు తీసిన బౌలర్లు..

1. మురళీధరన్‌(శ్రీలంక) : 872. ఆర్‌. అశ్విన్‌(ఇండియా) : 983.

అనిల్‌ కుంబ్లే(ఇండియా) : 1054.

షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా) : 1085.

గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(ఆస్ట్రేలియా) : 1106.

నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా) : 1237.

కర్ట్నీ వాల్ష్‌(వెస్టిండీస్‌) : 1298.

జేమ్స్‌ ఆండర్సన్‌(ఇంగ్లండ్‌) : 1299.

స్టువర్ట్‌ బ్రాడ్‌(ఇంగ్లండ్‌) : 140

➡️