ఆ రూల్‌తో బౌలర్లకు ఊరట!

Mar 25,2024 23:13 #Cricket, #Sports
  • ఓవర్లో రెండు బౌన్సర్లపై గవాస్కర్‌

అహ్మదాబాద్‌ : ఆధునిక క్రికెట్‌ పూర్తిగా బ్యాటర్ల స్వర్గధామం. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బ్యాటర్లు క్రికెట్‌ను శాసిస్తున్నారు. ఆటలో ఆధిపత్యం చెలాయించేందుకు బౌలర్లకు అవకాశాలు స్వల్పం!. ఇక టీ20 ఫార్మాట్‌లో బౌలర్ల ఆగచాట్లకు ఓ లెక్కంటూ లేదు అనటం అతిశయోక్తి కాదు. పూర్తిగా బ్యాటర్లు శాసిస్తున్న పొట్టి ఫార్మాట్‌ ఐపీఎల్‌లో తీసుకొచ్చిన కొత్త నిబంధన గేమ్‌ ఛేంజర్‌గా మారుతోంది. ఐపీఎల్‌ 17లో ఇప్పటివరకు ఏడు మ్యాచులే ముగిశాయి. అయినా, ఈ అంశంపై ఓ నిర్ధారణకు రావటం తొందరపాటు కాదేమో!. ఓ ఓవర్లో రెండు బౌన్సర్లు సంధించే స్వేచ్ఛతో బౌలర్లకు ఊరట దక్కిందని, బ్యాటర్లకు ఇది కష్టతరంగా మారిందని లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ‘ఓ ఓవర్లో రెండు బౌన్సర్లు సంధించవచ్చనే నిబంధన ఐపీఎల్‌ పోటీలో బ్యాటర్ల ఆధిపత్యానికి గండి కొట్టింది. ఈ రూల్‌తో మ్యాచ్‌ కాస్త బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. రెండు బౌన్సర్ల నిబంధనకు తోడు బౌండరీ పరిధులను కొన్ని మీటర్లు పెంచితే.. మిస్‌ హిట్‌లు పేస్‌ సాయంతో సిక్సర్లుగా మారకుండా బౌండరీ ఇవతలే ఫీల్డర్లకు క్యాచులుగా దక్కుతాయి. ఈ విషయంలో గ్రౌండ్స్‌మెన్‌ బాధ్యత తీసుకోవాలి’ అని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.

➡️