భారత్‌ ప్రత్యర్ధి ఆస్ట్రేలియా

Feb 8,2024 22:29 #Sports

సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో వికెట్‌ తేడాతో ఓడిన పాక్‌

ఐసిసి (అండర్‌19) వన్డే ప్రపంచకప్‌

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది. బెనోని వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్తాన్‌పై వికెట్‌ తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 180పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 164పరుగులకే 9వికెట్లు కోల్పోయి పరాజయపు అంచుల్లో నిలిచింది. ఈ క్రమంలో చివరి వికెట్‌కు మెక్‌ మిల్లన్‌(19), కల్లామ్‌(2) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేశారు. టాప్‌ ఆర్డర్‌లో హసైన్‌(17), అజన్‌(52), అరాఫత్‌(5) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్‌ టామ్‌ స్ట్రక్కర్‌ ఆరు వికెట్లు కూల్చి పాకిస్తాన్‌ను కట్టడి చేశాడు. దీంతో పాకిస్తాన్‌ జట్టు 48.5ఓవర్లలో 179పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగానే దిస్తుందని భావించినా.. పాకిస్తాన్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాపార్డర్‌లో డిక్సన్‌(50), మిడిలార్డర్‌లో పెర్కే(49), క్యాంప్‌బెల్‌(25) రాణించారు. చివర్లో మిల్లన్‌(19) క్రీజ్‌లో పాతుకుపోయి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 181పరుగులు చేసి విజయం సాధించింది. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా యువ జట్టు భారత యువజట్టుతో తలపడనుంది.

➡️