మార్ష్‌, డేవిడ్‌ వీరవిహారం-తొలి టి20లో కివీస్‌పై ఆసీస్‌ గెలుపు

Feb 21,2024 22:20 #Sports

వెల్లింగ్టన్‌: మిఛెల్‌ మార్ష్‌, టిమ్‌ డేవిడ్‌ రాణించడంతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా.. కివీస్‌ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. ఆ జట్టు సారథి మిచెల్‌ మార్ష్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ (44 బంతుల్లో 72నాటౌట్‌, 2ఫోర్లు, 7సిక్సర్లు)కి తోడు మిడిలార్డర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌.. పది బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు భారీ సిక్సర్ల సాయంతో 31 పరుగులతో రాణించాడు. దీంతో ఆసీస్‌ ఆరు వికెట్ల తేడాతో తొలి టి20 ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (35 బంతుల్లో 68, 2ఫోర్లు, 6సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (46బంతుల్లో 63, 5ఫోర్లు, 2సిక్సర్లు), ఫిన్‌ అలెన్‌ (17బంతుల్లో 32, 2ఫోర్లు, 3సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు భారీస్కోర్‌ చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మిఛెల్‌ మార్ష్‌కు లభించగా.. మూడు టి20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో టి20 అక్లాండ్‌ వేదికగా శుక్రవారం జరగనుంది.

➡️