‘రెజ్లింగ్‌’ నుంచి రిటైర్మెంట్‌.. బ్రిజ్‌ భూషణ్‌ కీలక ప్రకటన

Dec 24,2023 22:30 #Sports

ఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య నూతన ప్యానెల్‌ను కేంద్రం సస్పెండ్‌ చేసిన వేళ.. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేశారు. రెజ్లింగ్‌ వ్యవహారాల నుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన ప్యానెల్‌ దీనిని చూసుకుంటుందని తెలిపారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు ఇతర అనేక బాధ్యతలు తనపై ఉన్నాయన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం బ్రిజ్‌భూషణ్‌ ఈ మేరకు మాట్లాడారు.”నేను 12 ఏళ్లపాటు రెజ్లింగ్‌కు సేవలందించాను. అది మంచో, చెడో.. కాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతం నేను రెజ్లింగ్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా. క్రీడలతో నా సంబంధాన్ని తెంచుకుంటున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను కొత్తగా ఎన్నికైన సంఘం చూసుకుంటుంది. నాపై అనేక ఇతర బాధ్యతలున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా రాజకీయాలకు దూరంగా ఉంటాను’ అని బ్రిజ్‌భూషణ్‌ వ్యాఖ్యానించారు. నడ్డాతో భేటీ సందర్భంగా రెజ్లింగ్‌ వ్యవహారాల ప్రస్తావనేదీ రాలేదన్నారు.డిసెంబరు 21న నిర్వహించిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడైన సంజరు సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే.. కొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆదివారం సస్పెండ్‌ చేసింది. అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను హడావుడిగా నిర్వహించేందుకు సిద్ధం కావడాన్ని తప్పుపట్టింది. అయితే.. యువ క్రీడాకారులు తమ కెరీర్‌లో ఒక ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ పోటీలను త్వరగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్రిజ్‌ భూషణ్‌ తెలిపారు.మరోవైపు.. సమాఖ్య వ్యవహారాల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ)ను క్రీడామంత్రిత్వ శాఖ కోరింది. అథ్లెట్ల ఎంపిక సహా డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు ఈ తాత్కాలిక కమిటీ చూస్తుందని ‘ఐవోఏ’ చీఫ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ”కొత్త ప్యానెల్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ ఆఫీస్‌ బేరర్ల ప్రభావం నేపథ్యంలో.. దాని పాలన, సమగ్రత విషయంలో ఆందోళనలు తలెత్తుతున్నాయి. దీని పరిష్కారానికి ఐవోఏ తగు చర్యలు తీసుకోవాలి” అని తెలిపింది.

➡️