విశాఖలో క్రికెట్‌ సందడి- ఇంగ్లండ్‌తో రెండోటెస్ట్‌ నేటినుంచే..

Feb 2,2024 10:54 #Sports

– సర్పరాజ్‌, పటీధర్‌, షోయబ్‌ ఛాన్స్‌ దక్కేదెవరికో..?

– ఉ.9.30గం||ల నుంచి

విశాఖపట్నం: విశాఖపట్నంలో క్రికెట్‌ సందడి నెలకొంది. చాలాకాలం తర్వాత ఈ మైదానంలో ఓ టెస్ట్‌ జరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. డాక్టర్‌ వైఎస్సార్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దఅష్ట్యా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను జట్టులో చేర్చింది బిసిసిఐ.ఓటమెరుగని భారత్‌..అయితే విశాఖ గడ్డపై టీమిండియాకు తిరుగులేదు. ఈ మైదానంలో ఆడిన రెండు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో 2016లో ఒక మ్యాచ్‌ ఆడగా.. భారత్‌ 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(161, 81) రెండు ఇన్నింగ్స్‌ల్లో సత్తా చాటాడు. అశ్విన్‌ (5, 3) 8 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రిికాతో 2019లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే విశాఖ గడ్డపై టీమిండియాకు తిరుగులేదని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.పిచ్‌ రిపోర్ట్‌..ఈ పిచ్‌ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు టెస్ట్‌లు జరగ్గా.. స్పిన్నర్లు 36.04 సగటుతో 47 వికెట్లు తీసారు. పేసర్లు 32.86 యావరేజ్‌తో 23 వికెట్లు పడగొట్టారు. రెండుసార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. ఇక్కడ యావరేజ్‌గా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 479గా ఉంది. టాస్‌ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది.షోయబ్‌ బషీర్‌ అరంగేట్రం..టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది. జాక్‌ లీచ్‌ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్‌వుడ్‌ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్‌మెంట్‌. ఈ మ్యాచ్‌లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్‌వుడ్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. హైదరాబాద్‌ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో జాక్‌ లీచ్‌ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్‌ సెషన్‌లో అతడు పాల్గనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్‌కు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు.

ఇంగ్లండ్‌: బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), డకెట్‌, క్రాలే, రూట్‌, పోప్‌, బెయిర్‌స్టో, ఫోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, ఆండర్సన్‌.

ఇండియా: రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, జైస్వాల్‌, శ్రేయస్‌, శ్రీకర్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, అక్షర్‌, సిరాజ్‌/ముఖేష్‌, బుమ్రా, రజత్‌ పటీధర్‌, సుందర్‌/సర్పరాజ్‌ ఖాన్‌.

➡️