సూపర్‌ సంజు!

Mar 25,2024 08:19 #Sports

రాయల్స్‌ కెప్టెన్‌ అర్థ సెంచరీ
ఛేదనలో పూరన్‌ పోరాటం వృథా
లక్నోపై రాజస్థాన్‌ గెలుపు
రాజస్థాన్‌ 193/4, లక్నో 173/6
రాజస్థాన్‌ రాయల్స్‌ రాజసం చూపించింది. ఐపీఎల్‌ 17 సీజన్‌ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై అలవోక విజయం సాధించింది. సంజు శాంసన్‌ (82 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. వరుసగా ఐదో సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ సాధించి అరుదైన రికార్డును సాధించాడు. 194 పరుగుల ఛేదనలో నికోలస్‌ పూరన్‌ (64 నాటౌట్‌), కెఎల్‌ రాహుల్‌ (58) అర్థ సెంచరీలో సరిపోలేదు. 20 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపొందింది.
జైపూర్‌ : సంజు శాంసన్‌ (82 నాటౌట్‌, 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్‌ అనిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వరుసగా ఐదో సీజన్‌లో తొలి మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించిన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన సంజు శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు అలవోక విజయాన్ని కట్టబెట్టాడు. సంజు శాంసన్‌కు తోడు రియాన్‌ పరాగ్‌ (43, 29 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (20 నాటౌట్‌, 12 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్‌ చతికిల పడింది. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (58, 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (64 నాటౌట్‌, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించినా.. లక్నోను ఓటమి నుంచి గట్టెక్కించలేదు. సంజు శాంసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
ఇద్దరు మెరిసినా.. : లక్నో లక్ష్యం 194 పరుగులు. సవారు మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇది కష్టమేమీ కాదు. రాజస్థాన్‌ పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, బర్గర్‌లు పవర్‌ప్లేలో నిప్పులు చెరిగారు. క్వింటన్‌ డికాక్‌ (4), దేవదత్‌ పడిక్కల్‌ (0), ఆయుశ్‌ బదాని (1) విఫలమయ్యారు. 11/3తో లక్నో సూపర్‌జెయింట్స్‌ టాప్‌ ఆర్డర్‌ కకావికలైంది. ఈ దశలో ఇంపాక్ట్‌ ఆటగాడు దీపక్‌ హుడా (26)తో కలిసి కెఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ క్రమంలో లక్నో రన్‌రేట్‌ బాగా పడిపోయింది. హుడా అవుటయ్యే సమయానికి లక్నో 7.3 ఓవర్లలో 60/4తో నిలిచింది. ఓ ఎండ్‌లో కెప్టెన్‌ రాహుల్‌ నెమ్మదిగా ఆడినా.. నికోలస్‌ పూరన్‌ (64) దంచికొట్టాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో దండెత్తాడు. రాహుల్‌, పూరన్‌ క్రీజులో ఉండగా లక్నో 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. కానీ ఇక్కడే రాయల్స్‌ బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. రాహుల్‌ వికెట్‌తో పూరన్‌పై ఒత్తిడి రెట్టింపు అయ్యింది. మార్కస్‌ స్టోయినిస్‌ (3), కృనాల్‌ పాండ్య (3 నాటౌట్‌, 5 బంతుల్లో) నిరాశపరిచారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ 173 పరుగులే చేసింది. 20 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించింది. రాయల్స్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ (2/35), బర్గర్‌ (1/30), అశ్విన్‌ (1/35), సందీప్‌ శర్మ (1/22) రాణించారు.
చెలరేగిన శాంసన్‌ : టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. జోశ్‌ బట్లర్‌ (11) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ (24, 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినా.. వికెట్‌ కాపాడుకోలేదు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (82 నాటౌట్‌) పవర్‌ప్లేలోనే క్రీజులోకి వచ్చినా ఆఖరు వరకు ఆడాడు. రియాన్‌ పరాగ్‌ (43) తోడుగా రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు. సంజు, పరాగ్‌లు మూడో వికెట్‌కు 59 బంతుల్లోనే 93 పరుగులు జత చేశారు. శాంసన్‌ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో వరుసగా ఐదో సీజన్‌ల్లో తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. పరాగ్‌ మూడు సిక్సర్లు, ఓ బౌండరీతో మెరిశాడు. పరాగ్‌తో పాటు హెట్‌మయర్‌ (5) నిష్క్రమించినా.. ధ్రువ్‌ జురెల్‌ (20 నాటౌట్‌) తోడుగా ఇన్నింగ్స్‌కు అదిరే ముంగింపు అందించాడు సంజు. లక్నో సూపర్‌జెయింట్స్‌ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హాక్‌ (2/41), మోషిన్‌ ఖాన్‌ (1/45), రవి బిష్ణోరు (1/38) రాణించారు.

స్కోరు వివరాలు :
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) హార్దిక్‌ (బి) మోషిన్‌ ఖాన్‌ 24, జోశ్‌ బట్లర్‌ (సి) రాహుల్‌ (బి) నవీన్‌ హాక్‌ 11, సంజు శాంసన్‌ నాటౌట్‌ 82, రియాన్‌ పరాగ్‌ (సి) దీపక్‌ హుడా (బి) నవీన్‌ హాక్‌ 43, షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (సి) రాహుల్‌ (బి) రవి బిష్ణోరు 5, ధ్రువ్‌ జురెల్‌ నాటౌట్‌ 20, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 193.
వికెట్ల పతనం : 1-13, 2-49, 3-142, 4-150.
బౌలింగ్‌ : మోషిన్‌ ఖాన్‌ 4-0-45-1, నవీన్‌ ఉల్‌ హాక్‌ 4-0-41-2, కృనాల్‌ పాండ్య 4-0-19-0, రవి బిష్ణోయ్ 4-0-38-1, యశ్‌ ఠాకూర్‌ 3-0-43-0, ఆయుశ్‌ బదాని 1-0-6-0.
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ : క్వింటన్‌ డికాక్‌ (బి) బర్గర్‌ (బి) బౌల్ట్‌ 4, కెఎల్‌ రాహుల్‌ (సి) జురెల్‌ (బి) సందీప్‌ శర్మ 58, దేవదత్‌ పడిక్కల్‌ (బి) బౌల్ట్‌ 0, ఆయుశ్‌ బదాని (సి) బట్లర్‌ (బి) బర్గర్‌ 1, నికోలస్‌ పూరన్‌ నాటౌట్‌ 64, మార్కస్‌ స్టోయినిస్‌ (సి) జురెల్‌ (బి) అశ్విన్‌ 3, కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 3, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173.
వికెట్ల పతనం : 1-4, 2-10, 3-11, 4-60, 5-145, 6-154.
బౌలింగ్‌ : ట్రెంట్‌ బౌల్ట్‌ 4-0-35-2, బర్గర్‌ 3-0-30-1, రవిచంద్రన్‌ అశ్విన్‌ 4-0-35-1, అవేశ్‌ ఖాన్‌ 3-0-21-0, యుజ్వెంద్ర చాహల్‌ 3-0-25-1, సందీప్‌ శర్మ 3-0-22-1.

➡️