సెమీస్‌కు బాంబ్రీ జోడి

Jan 5,2024 22:05 #Sports

సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఓడిన నాదల్‌

బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నీ

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఏటిపి-250 టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి భారత్‌కు చెందిన యుకీ బాంబ్రీ జోడి దూసుకెళ్లింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్‌. హాసీతో జతకట్టిన బాంబ్రీ ఈ టోర్నమెంట్‌లో 8వ సీడ్‌గా బరిలోకి దిగారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో బాంబ్రీ-హాస్‌ జోడీ 7-6(7-5, 7-6(8-6)తో 3వ సీడ్‌ అమెరికా జోడీ లామోస్‌ావిత్రో జోడీపై చెమటోడ్చి నెగ్గారు. రెండు సెట్లను టైబ్రేక్‌లో గెలుచుకోవడం విశేషం. శనివారం జరిగే సెమీస్‌లో భారత జోడీ 2వ సీడ్‌ రోజర్‌(ఫ్రాన్స్‌)-గ్లాన్సూల్‌(బ్రిటన్‌) జోడీతో తలపడనున్నారు.పోరాడి ఓడిన నాదల్‌..పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో రఫెల్‌ నాదల్‌ ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో నాదల్‌ 7-5, 6-7(6-8), 3-6తో థాంప్సన్‌(ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడాడు. తొలిసెట్‌ను నెగ్గిన నాదల్‌.. రెండోసెట్‌ టై బ్రేక్‌లో ఓ దశలో 4-0పాయింట్ల ఆధిక్యతలో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సమర్పించుకొని ఆ సెట్‌ను కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడోసెట్‌లోనూ రాణించకపోవడంతో ఓటమిపాలయ్యాడు. శనివారం రూన్‌-సిపియులిన్‌, థాంప్సన్‌-డిమిట్రోవ్‌ల మధ్య సెమీఫైనల్‌ జరగనున్నాయి. ఇక మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్‌ సబలెంకా, 2వ సీడ్‌ రైబకినా ప్రవేశించారు. శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సబలెంకా 6-1, 6-4తో 5వ సీడ్‌ కసట్కినాపై, రైబకినా 6-1తో 11వ పొటపొవాపై గెలిచారు. తొలిసెట్‌ గెలుపు అనంతరం ప్రత్యర్ధి గాయం కారణంగా టోర్నీనుంచి వైదొలగడంతో రైబకినా విజేతగా నిలిచింది. శనివారం జరిగే సెమీస్‌ సబలెంకా-అజరెంకా, రైబకినా-నొస్కోవా మధ్య జరగనుంది.

➡️