గెలుపుకు చేరువై ఓడిన ఆంధ్ర

Feb 27,2024 08:17 #Cricket, #Ranji Trophy, #Sports
  • మధ్యప్రదేశ్‌ చేతిలో నాలుగు పరుగుల తేడాతో పరాజయం

ఇండోర్‌: రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పరాజయాన్ని చవిచూసింది. మధ్యప్రదేశ్‌ నిర్దేశించిన 170పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గెలుపుకు చేరువై కేవలం 4 పరుగుల దూరంలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన రికీ భురు బృందం.. 170 పరుగుల లక్ష్యానికి ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర 165పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ ఓటమితో రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. టాస్‌ ఓడిన ఆంధ్ర జట్టు ముందుగా బౌలింగ్‌ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్‌ చేసింది. యష్‌ దూబే(64) టాప్‌ స్కోరర్‌. ఆంధ్ర బౌలర్లు కేవీ శశికాంత్‌ నాలుగు, నితీశ్‌ రెడ్డి మూడు వికెట్స్‌ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 172 పరుగులకే ఆలౌట్‌ అయింది. రికీ భురు 32, కరణ్‌ షిండే 38 ఫర్వాలేదనిపించారు. మాజీ కెప్టెన్‌ హనుమ విహారి(14) నిరాశపరిచాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో అనుభవ్‌ అగర్వాల్‌, కుమార్‌ కార్తికేయ తలో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో ఆంధ్ర 62 పరుగులు వెనుకబడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మధ్యప్రదేశ్‌ 107 ఆలౌట్‌ చేసింది. హిమాన్షు మంత్రి (43) ఒక్కడే పోరాడాడు. నితీశ్‌ రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆంధ్ర 170 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఛేదించాల్సి వచ్చింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఆంధ్ర.. సోమవారం హనుమ విహారి (43), కరణ్‌ షిండే (5) త్వరగా అవుటయ్యారు. అశ్విన్‌ హెబ్బర్‌ (22) పోరాడినా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు. గిరినాథ్‌ రెడ్డి (15) పోరాడినా తృటిలో విజయం చేజారింది. ఈ విజయంతో మధ్యప్రదేశ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

మరో క్వార్టర్‌ఫైనల్లో తమిళనాడు జట్టు ఇన్నింగ్స్‌ 33పరుగుల తేడాతో సౌరాష్ట్రను చిత్తుచేసి సెమీస్‌కు చేరింది. మంగళవారం చివరిరోజు పోటీలో విదర్భపై కర్ణా 371పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక వికెట్‌ నష్టపోయి 103పరుగులు చేసింది. చివరి క్వార్టర్స్‌లో ముంబయి జట్టు బరోడాపై ఇప్పటికే 415పరుగుల ఆధిక్యతలో నిలిచింది.

➡️