డికాక్‌, పూరన్‌ మెరుపులు

Mar 31,2024 09:53 #Sports
  • పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో లక్నో గెలుపు

లక్నో: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు నష్టపోయి 178 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది రెండో ఓటమి. తొలుత ఓపెనర్‌ డికాక్‌(54) అర్ధసెంచరీకి తోడు పూరన్‌(42), కృనాల్‌ పాండ్యా(43) కూడా బ్యాట్‌ ఝుళిపించడం తో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. పంజాబ్‌పై బోణీ కట్టాలన్న సంకల్పంతో ఉన్న లక్నో బ్యాటర్లు క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌, కృనాల్‌ పాండ్యా చెలరేగి ఆడారు. లక్నోకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. నాలుగో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ (15), ఆరో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (9) ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టొయినీస్‌(19) కూడా రాణించలేకపోయాడు. తొమ్మిదో ఓవర్‌లో చాహర్‌ వేసిన బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. నికోలస్‌ పూరన్‌ (42; 21బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు).. ఓపెనర్‌ డికాక్‌(54; 38బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) వీరిద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ అందించారు. ఆ వెంటనే పెవిలియన్‌ చేరాడు. డికాక్‌, పూరన్‌ పరుగుల వేటను కృనాల్‌ పాండ్యా (43; 22బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) కొనసాగించాడు. చివర్లో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో 19 ఓవర్‌లో లక్నో వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు సామ్‌ కర్రన్‌కు మూడు, ఆర్ష్‌దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ ధావన్‌(70), బెయిర్‌స్టో(42) ధాటిగా ఆడి 11.4ఓవర్లలోనే 102పరుగుల గట్టి పునాది వేశారు. వీరిద్దరూ ఔటయ్యాక మరో బ్యాటర్‌ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ప్రభ్‌సిమ్రన్‌(19), జితేశ్‌ శర్మ(6), సామ్‌ కర్రన్‌(0) నిరాశపరిచారు. లక్నో బౌలర్లు మయాంక్‌ యాదవ్‌కు మూడు, మొహిసిన్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోర్‌బోర్డు (సంక్షిప్తంగా)..
లక్నో: 199/8(20 ఓవర్లలో)
(డికాక్‌ 54; కృనాల్‌ 43(నాటౌట్‌);
సామ్‌ కర్రన్‌ 3/28)
పంజాబ్‌: 178/5 (20 ఓవర్లలో)
(ధావన్‌ 70; బెయిర్‌స్టో 42;
మయాంక్‌ యాదవ్‌ 3/27)

➡️