పట్టు బిగిస్తున్న భారత్‌

Dec 23,2023 11:10 #Sports

– స్మృతి, రీచా, రోడ్రిగ్స్‌, దీప్తి అర్ధసెంచరీలు

– ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్‌లో 157పరుగుల ఆధిక్యత

ముంబయి: ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలజట్టు పట్టు బిగిస్తోంది. రెండోరోజైన శుక్రవారం ఆట నిలిచే సమయానికి భారతజట్టు ఏడు వికెట్ల నష్టానికి 376పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌పై ఇప్పటికే 157పరుగుల ఆధిక్యత లభించింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(70), పూజా వస్త్రాకర్‌(33) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు ఇప్పటికే 102 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 98పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ స్నేహ్ రాణా(9) రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. స్మృతి మంధాన(74), స్నేహ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటయ్యారు. అనవసర పరుగుకు మంధాన ప్రయత్నించి రనౌటైంది. ఆ తర్వాత రిచా ఘోష్‌(52), జెమీమా రోడ్రిగ్స్‌(73) అర్ధసెంచరీలతో రాణించి 4వ వికెట్‌కు 113పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. మరోసారి ఆసీస్‌ బౌలర్లు చెలరేగి వారిద్దరితోపాటు యాస్టికా భాటియా(1)తోపాటు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(0)ను ఔట్‌ చేశారు. దీంతో ఆసీస్‌ పట్టు బిగించేలా కనిపించింది. ఈ క్రమంలో దీప్తి శర్మ-పూజా వస్త్రాకర్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్‌కు భారీ ఆధిక్యతను సంపాదించిపెట్టారు. ఇంగ్లండ్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన దీప్తి శర్మ అర్ధసెంచరీకి తోడు, పూజ వస్త్రాకర్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లు గార్డినర్‌కు నాలుగు, కిమ్‌ గ్రాత్‌, జనాసెన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…

ఆస్ట్రేలియా మహిళల తొలి ఇన్నింగ్స్‌: 219ఆలౌట్‌భారత మహిళల తొలి ఇన్నింగ్స్‌: షెఫాలీ వర్మ (ఎల్‌బి)జన్నాసెన్‌ 40, స్మృతి మంధాన (రనౌట్‌) గ్రాత్‌/గార్డినర్‌ 74, స్నేహ్ రాణా (బి)గార్డినర్‌ 9, రీచా ఘోష్‌ (సి)గార్డినర్‌ (బి)కిమ్‌ గ్రాత్‌ 52, జెమిమా రోడ్రిగ్స్‌ (సి)సదర్లాండ్‌ (బి)గార్డినర్‌ 73, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (ఎల్‌బి)గార్డినర్‌ 0, యాస్టికా భాటియా (ఎల్‌బి)గార్డినర్‌ 1, దీప్తి శర్మ (బ్యాటింగ్‌) 70, పూజ వస్త్రాకర్‌ (బ్యాటింగ్‌) 33, అదనం 24. (119ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 375పరుగులు.

వికెట్ల పతనం: 1/90, 2/140, 3/147, 4/260, 5/261, 6/265, 7/274

బౌలింగ్‌: లారెన్‌ ఛట్లీ 9-3-23-0, కిమ్‌ గ్రాత్‌ 10-1-49-1, ఎలీసా ఫెర్రీ 4-0-31-0, ఎలీసా గార్డినర్‌ 41-7-100-4, జన్నాసెన్‌ 18-4-42-1, సథర్లాండ్‌ 8-2-20-0, ఎలేనా కింగ్‌ 19-1-69-0, తహిలా మెక్‌గ్రాత్‌ 10-2-22-0

 

➡️