ISL Season-10: టైటిల్‌ విజేత ముంబయి సిటీ

May 4,2024 23:19 #football, #Sports
  • ఫైనల్లో మోహన్‌ బగాన్‌పై 3-1గోల్స్‌ తేడాతో గెలుపు

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌లీగ్‌(ఐఎస్‌ఎల్‌) సీజన్‌-10 టైటిల్‌ను మాజీ ఛాంపియన్‌ ముంబయి సిటీ ఎఫ్‌సి జట్టు చేజిక్కించుకుంది. సాల్ట్‌లేక్‌ స్టేడియంలో శనివారం ఉత్కంఠబరితంగా సాగిన ఫైనల్లో ముంబయి సిటీ జట్టు 3-1గోల్స్‌ తేడాతో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్స్‌ జట్టును ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి మోహన్‌ బగాన్‌ 1-0 ఆధిక్యతలో నిలిచినా.. రెండో అర్ధభాగంలో ముంబయి జట్టు మూడు గోల్స్‌ కొట్టి టైటిల్‌ను ఎగరేసుకుపోవడం విశేషం. ఇక మోహన్‌ బగాన్‌ జట్టుకు తొలి అర్ధభాగంలో మూడుసార్లు గోల్‌చేసే సువర్ణావకాశాలు లభించినా ప్రయోజనం లేకపోయింది. మోహన్‌ బగాన్‌ తరఫున ఏకైక గోల్‌ను జాసన్‌ కమ్మింగ్స్‌(44వ ని.లో) చేయగా.. ముంబయి సిటీ తరఫున జార్జి(53వ.), బిపిన్‌ సింగ్‌(81వ.), జాకోబ్‌(90+7వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ఐఎస్‌ఎల్‌ టోర్నీ సుమారు ఆరునెలలపాటు సాగింది. మొత్తం 12జట్లు టైటిల్‌కు పోటీపడగా.. ఒక్కో జట్టు 22మ్యాచ్‌లు ఆడిన అనంతరం టాప్‌-లో ఉన్న జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో ఎటికె మోహన్‌ బగాన్‌ జట్టు 2-0తో ఒడిషాను చిత్తుచేయగా.. రెండో సెమీస్‌లో ముంబయి సిటీ జట్టు 2-0గోల్స్‌తో గోవాను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో మోహన్‌ బగాన్‌ జట్టు ఆడిన 22 మ్యాచుల్లో 15 గెలుపు, 3 డ్రాలతో సహా 48పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచి విజేత షీల్డ్‌ను సొంతం చేసుకుంది. మోహన్‌ బగాన్‌, ముంబయి ఎఫ్‌సి జట్లు ఒక్కోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ముంబయి జట్టు తొలిసారి 2020-21లో, మోహన్‌ బగాన్‌ 2022-23లో తొలిసారి ఐఎస్‌ఎల్‌ టైటిళ్లను ముద్దాడాయి.

➡️