నాదల్‌ తొలిరౌండ్‌ ప్రత్యర్ధి జ్వెరేవ్‌

May 23,2024 23:01 #Sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ డ్రా విడుదల
పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ డ్రాను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. ఈ టైటిల్‌ను 14సార్లు చేజిక్కించుకొని రికార్డుపుటల్లోకెక్కిన రఫెల్‌ నాదల్‌కు తొలిరౌండ్‌లోనే గట్టి ప్రత్యర్ధితో ఢ కొట్టనున్నాడు. నాదల్‌ తొలిరౌండ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌తో తలపడనున్నాడు. రెండేళ్లుగా జ్వెరేవ్‌ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఇక రఫెల్‌ నాదల్‌ ఏడాదిగా తుంటిగాయం కారణంగా ప్రధాన టోర్నీలకు దూరంగా ఉంటున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ తొలిరౌండ్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఆటగాడు పియర్‌ హెర్బర్ట్‌తో ఢకొీట్టనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ జెన్నిక్‌ సిన్నర్‌ తొలిరౌండ్‌లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌తో, 2సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ 3వ సీడ్‌గా ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. ఇక భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ తొలిరౌండ్‌లో 18వ ర్యాంక్‌ ఆటగాడు, రష్యాకు చెందిన కరెన్‌ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. సుమిత్‌ ఏటిపి ర్యాంకింగ్స్‌లో 100లోపు నిలవడంతో అతడు నేరుగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు.
స్వైటెక్‌కు టాప్‌సీడింగ్‌..
ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌(పోలండ్‌)కు టాప్‌సీడింగ్‌ లభించింది. ఆమె తొలిరౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనుంది. ఇక రెండోరౌండ్‌లో మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా(జపాన్‌)తో ఆడాల్సి ఉంటుంది. ఇక ఒసాకా తొలిరౌండ్‌లో ఇటలీకి చెందిన లూసియా బ్రోంజెట్టితో తలపడనుంది. ఇక 2వ సీడ్‌, 2సార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ ఆర్యానా సబలెంకా తొలిరౌండ్‌లో ఎరికా ఆండ్రీవా(అమెరికా)తో తలపడనుంది. మూడోసీడ్‌, యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ కోకా గాఫ్‌ తొలిరౌండ్‌లో క్వాలిఫయర్‌తో, 5వ సీడ్‌, వింబుల్డన్‌ మాజీ ఛాంపియన్‌ ఎలెనా రైబకినా బెల్జియంకు చెందిన మినెన్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి పెగూలా వైదొలిగింది.
ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌లో..
నాదల్‌ × జ్వెరేవ్‌
మోన్‌ఫీల్‌ × టిగో సెబోత్‌
కాస్పర్‌ రూఢ్‌ × జాకోబ్‌ మెన్‌సిక్‌
సుమిత్‌ నాగల్‌ × కరెన్‌ ఖచనోవ్‌
హోల్జర్‌ రూనే × డానియేల్‌ ఎవాన్స్‌
హాంబర్ట్‌ × సొనేగో
సిట్సిపాస్‌ × ఫుస్కోవిక్స్‌
వావ్రింకా × ఆండీ ముర్రే
జెన్నిక్‌ సిన్నర్‌ × క్రిస్టోఫర్‌ ఈబంక్స్‌

➡️