ప్లే ఆఫ్స్‌పై రైజర్స్‌ గురి

May 5,2024 23:15 #2024 ipl, #Cricket, #Sports
  • నేడు ముంబయి ఇండియన్స్‌తో ఢీ

ముంబయి : ఐపీఎల్‌ 17వ సీజన్లో అసమాన బ్యాటింగ్‌ విన్యాసాలతో ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలు కొడుతున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. పవర్‌ప్లేలో ఊహకందని విధ్వంసం సృష్టింస్తున్న సన్‌రైజర్స్‌ లక్ష్య ఛేదనలో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారటం.. లీగ్‌ దశలో మరో నాలుగు మ్యాచులే ఆడాల్సి ఉండటంతో బెర్త్‌ ఖాయం చేసుకునేందుకు హైదరాబాద్‌ తహతహ లాడుతోంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు తోడు స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, యార్కర్ల హీరో టి. నటరాజన్‌ సైతం ఫామ్‌లోకి వచ్చారు. సన్‌రైజర్స్‌ చవిచూసిన బౌలింగ్‌ కష్టాలు తీరినట్టే కనిపిస్తుంది. ట్రావిశ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలు అంచనాలు అందుకుంటే నేడు వాంఖడేలోనూ పరుగుల వరద పారటం ఖాయమే. ఏడో విజయంపై కన్నేసి హైదరాబాద్‌ బరిలోకి దిగుతుండగా.. తొమ్మిదో పరాజయం నుంచి తప్పించుకునేందుకు ముంబయి ఇండియన్స్‌ ఆశపడుతుంది. మ్యాచ్‌ విన్నర్లతో కూడిన ముంబయి ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య సారథ్యంలో ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. కీలక బ్యాటర్లు ఎవరూ సరైన సమయంలో రాణించలేదు. 11 మ్యాచుల్లో 8 పరాజయాలు చవిచూసిన ముంబయి ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచుల్లోనైనా మెరిసి పాయింట్ల పట్టికలో స్థానం మెరుగు పర్చుకునేందుకు హార్దిక్‌సేన ఎదురుచూస్తుంది.

➡️