SPORTS : రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌..

Mar 19,2024 09:08 #back, #Retirement, #Sports, #Star cricketer

టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌ను శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా వెనక్కి తీసుకున్నారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంక ప్రకటించిన జట్టులో హసరంగాకు చోటు దక్కింది. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దఅష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో వనిందు హసరంగా టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికారు. బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా.. మళ్లీ రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమయ్యారు. లంక తరఫున హసరంగా 4 టెస్టులు ఆడారు. 54 వన్డేలు, 65 టీ20లు ఆడారు. హసరంగా ఆల్‌రౌండర్‌ అన్న విషయం తెలిసిందే. స్పిన్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేస్తారు.

బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌కు వనిందు హసరంగా ఎంపిక కావడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది. ఐపిఎల్‌ 2024 ఆరంభ మ్యాచులకు అతడు దూరం కావాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ మార్చి 26 నుంచి, రెండో టెస్ట్‌ ఏప్రిల్‌ 3 నుంచి ఆరంభం అవుతాయి. దాంతో సన్‌రైజర్స్‌ ఆడే ఆరంభ మ్యాచులకు హసరంగా దూరం కానున్నారు. ఐపిఎల్‌ 17వ సీజన్‌ మార్చి 22 నుంచి ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే.

శ్రీలంక టెస్టు జట్టు :
ధనంజయ డిసిల్వా (కెప్టెన్‌), కుసాల్‌ మెండిస్‌ (వైస్‌ కెప్టెన్‌), దిముత్‌ కరుణరత్నే, నిషాన్‌ మదుష్క, ఏంజెలో మాథ్యూస్‌, దినేష్‌ చండిమల్‌, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్‌, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్‌ జయసూర్య, రమేష్‌ మెండిస్‌, నిషాన్‌ పెసిరి, నిషాన్‌ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర.

➡️