French Open: ఫైనల్‌కు స్వైటెక్‌, పోలిని

Jun 6,2024 22:57 #French Open, #Sports, #Tennis

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌, ఇటలీకి చెందిన 12వ సీడ్‌ పోలిని ప్రవేశించారు. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో స్వైటెక్‌ 6-2, 6-4తో 3వ సీడ్‌, అమెరికా సంచలనం కోకా గాఫ్‌పై, పోలిని 6-3, 6-1తో రష్యాకు చెందిన ఆండ్రీవాపై వరుస సెట్లలో విజయం సాధించారు. తొలి సెమీస్‌ తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గిన స్వైటెక్‌.. రెండోగేమ్‌లో ఒక బ్రేక్‌ పాయింట్‌తో మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో గాఫ్‌ మూడు ఏస్‌లను సంధించినా ప్రయోజనం లేకపోయింది. అలాగే నాలుగు డబుల్స్‌ ఫాల్స్‌ కూడా గాఫ్‌ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రెండో సెమీస్‌ కూడా ఏకపక్షంగానే సాగింది. తొలి సెట్‌ లో రెండు బ్రేక్‌ ప్రాయింట్లు సాధించి 6-3తో చేజిక్కించుకున్న పోలినికి రెండో సెట్‌లో ఎదురు లేకుండా పోయింది. ఆ సెట్‌లో ప్రత్యర్ధికి ఒక్క పాయింట్‌ మాత్రమే సమర్పించుకొని మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. శనివారం జరిగే టైటిల్‌ పోరు స్వైటెక్‌, పోలినిల మధ్య జరగనుంది. స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను మూడుసార్లు చేజిక్కించుకోగా.. పోలిని కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది.

సెమీస్‌లో బొప్పన్న జోడీకి నిరాశ..
పురుషుల డబుల్స్‌ సెమీస్‌కు చేరి మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురిపెట్టిన బొప్పన్న-ఎబ్డెన్‌ జోడీకి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరిగిన సెమీస్‌లో మాధ్యూ ఎబ్డెన్‌(ఆస్ట్రేలియా)-బొప్పన్న(బారత్‌) జోడీ 5-7, 6-2, 2-6తో 11వ సీడ్‌ ఇటలీకి చెందిన బోలెల్లి-వవస్సోన్‌ల చేతిలో ఓడారు.

➡️