మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తు.. 434 పరుగులతో టీమ్‌ఇండియా ఘన విజయం

Feb 19,2024 07:59 #Cricket, #test match

రాజ్‌కోట్‌ :’బజ్‌బాల్‌’ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోన్న ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా వణికించింది. డబుల్‌ సెంచరీతో యశస్వి భారత్‌కు భారీ స్కోరు అందించగా.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యటక జట్టు ఏ దశలోనూ రేసులో నిలవలేకపోయింది. కనీస పోరాటం కూడా చేయలేక చతికిల పడింది. టీమ్‌ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగిపోయారు. రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది.

టీమ్‌ఇండియా నిర్దేశించిన 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (214) డబుల్‌ సెంచరీ సాధించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 లీడ్‌ సాధించింది.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. నాలుగో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ మూడో సీజన్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ (59.52 శాతం) రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ (75 శాతం) అగ్రస్థానంలో ఉంది.

ఓడినా.. గెలిచినా ఇంగ్లాండ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ, మూడో టెస్టులో భారీ లక్ష్యంతో ఛేదనను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ బ్యాటర్లు వేగంగా ఆడేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ‘బజ్‌బాల్‌’ క్రికెట్‌ను పక్కన పెట్టేసి మరీ ఇంగ్లాండ్‌ బ్యాటర్లు నెమ్మదిగా ఆడటం గమనార్హం. రనౌట్‌తో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనం ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెన్‌ డకెట్‌ (4) అనవసర పరుగుకు యత్నించి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలే (11)ను బుమ్రా ఎల్బీ చేశాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం ఇంగ్లాండ్‌కు సానుకూలంగా రాలేదు. ఓలీ పోప్‌ (3), జో రూట్‌ (7), జానీ బెయిర్‌స్టో (4) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (15) కూడా జట్టును కాపాడలేకపోయాడు. బెన్‌ ఫోక్స్‌ (16), టామ్‌ హార్ట్‌లీ (16) కాసేపు పోరాడారు. ఆఖరులో మార్క్‌ వుడ్‌ (33) దూకుడుగా ఆడి ఓటమి అంతరం మాత్రమే తగ్గించగలిగాడు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అతడే టాప్‌ స్కోరర్‌ కావడం విశేషం. రవీంద్ర జడేజా (5/41) తన సొంతమైదానంలో అదరగొట్టాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ 2, బుమ్రా, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు.

వ్యక్తిగత అత్యవసర కారణాలతో మ్యాచ్‌ మధ్యలోనే చెన్నైకి వెళ్లిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. నాలుగో రోజు టీ బ్రేక్‌ సమయానికి జట్టుతోపాటు చేరాడు. అయితే, ఎలాంటి పెనాల్టీ టైమ్‌ లేకుండానే నేరుగా మ్యాచ్‌లోకి వచ్చాడు. బౌలింగ్‌ కూడా చేసి ఒక వికెట్‌ తీశాడు. అయితే, అతడిపై ఎలాంటి పెనాల్టీ టైమ్‌ లేకుండా ఉండటానికి ఐసీసీ రూల్సే కారణం. ”ఎవరైనా ఆటగాడు సహేతుకమైన కారణంతో మైదానం వీడి.. మళ్లీ జట్టులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పెనాల్టీ టైమ్‌ విధించనవసరం లేదు. ఫీల్డ్‌ అంపైర్లు ఆ కారణాన్ని అంగీకరించని పక్షంలోనే పెనాల్టీ పడే అవకాశం ఉంది” అని ఐసీసీ నిబంధనలు తెలియజేస్తున్నాయి.

స్కోరు వివరాలు:

భారత్‌: తొలి ఇన్నింగ్స్‌ 445,

రెండో ఇన్నింగ్స్‌ 430/4 (డిక్లేర్డ్‌)

ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 319/10,

రెండో ఇన్నింగ్స్‌ 122/10

➡️