టెస్టుల్లో బెస్టు విక్టరీ

Feb 19,2024 11:28 #Sports

రాజ్‌’కోట’ మన సొంతమైంది. కీలక మూడో టెస్టులో ఆతిథ్య భారత్‌ అఖండ విజయం సాధించింది. పరుగుల పరంగా టెస్టుల్లో అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. 557 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. లోకల్‌ బారు రవీంద్ర జడేజా (5/41) ఐదు వికెట్ల మాయజాలంతో ఇంగ్లాండ్‌ను తిప్పేశాడు. 434 పరుగుల తేడాతో భారత్‌ మూడో టెస్టులో అఖండ విజయం అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 2-1తో ముందంజలోకి దూసుకెళ్లింది. యువ కెరటం యశస్వి జైస్వాల్‌ (214 నాటౌట్‌) అజేయ ద్వి శతకంతో చెలరేగాడు. విశాఖలో కెరీర్‌ తొలి డబుల్‌ సెంచరీ బాదిన జైస్వాల్‌.. రాజ్‌కోట్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ (91)కు తోడు అరంగ్రేట ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (68 నాటౌట్‌) మెరవటంతో ఇంగ్లాండ్‌ ముందు భారత్‌ భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్‌, ఇంగ్లాండ్‌ నాల్గో టెస్టు రాంచిలో శుక్రవారం నుంచి ఆరంభం కానుంది.

రాజ్‌కోట్‌లో ఆతిథ్య భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇంగ్లాండ్‌ను మూడో టెస్టులో చిత్తు చేసింది. రికార్డు 434 పరుగుల తేడాతో రాజ్‌కోట్‌ టెస్టులో టీమ్‌ ఇండియా విజయభేరి మోగించింది. 557 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్‌ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. లోకల్‌ హీరో రవీంద్ర జడేజా (5/41) ఐదు వికెట్ల మాయజాలానికి కుల్దీప్‌ యాదవ్‌ (2/19), అశ్విన్‌ (1/19), బుమ్రా (1/18) జత కలిశారు. దీంతో మూడో టెస్టు సైతం నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ భారత బౌలర్లకు దాసోహం అవగా.. టెయిలెండర్లు మార్క్‌వుడ్‌ (33, 15 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), టామ్‌ హర్ట్‌లీ (16, 36 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇంగ్లాండ్‌కు గౌరవప్రద మూడంకెల స్కోరు అందించారు. అంతకముందు, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 430/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (214 నాటౌట్‌, 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) అజేయ ద్వి శతకం బాదగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (68 నాటౌట్‌, 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ (91, 151 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో మెరువగా 98 ఓవర్లలో 430 పరుగుల వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన రవీంద్ర జడేజా.. బంతితో ఏడు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టులో విజయంతో సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యం సాధించింది.

ఇంగ్లాండ్‌ను తిప్పేశారు

ఇంగ్లాండ్‌ లక్ష్యం రికార్డు 557 పరుగులు. ఎటువంటి బ్యాటింగ్‌ లైనప్‌ అయినా.. ఈ లక్ష్యాన్ని ఛేదించటం కష్టసాధ్యమే. కానీ ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ దూకుడుతో కనీసం రేసులో నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ భారత బౌలర్లు మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. టీ విరామానికి ముందు 8.2 ఓవర్లలోనే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించారు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో బెన్‌ డకెట్‌ (4) రనౌట్‌గా నిష్క్రమించాడు. క్రావ్లీ సిగల్‌ ఇవ్వకుండానే సగం దూరం వెళ్లిన డకెట్‌.. తిరిగి క్రీజులోకి వచ్చేలోగా సిరాజ్‌ సూపర్‌ ఫీల్డింగ్‌తో వికెట్లను జురెల్‌ పడగొట్టాడు. జాక్‌ క్రావ్లీ (11)ని ఎల్బీగా బుమ్రా సాగనంపాడు. దీంతో 18/2 పరుగులకే ఇంగ్లాండ్‌ ఓపెనర్లను కోల్పోయింది. ఇక చివరి సెషన్లో ఇంగ్లాండ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒలీ పోప్‌ (3), జో రూట్‌ (7), జానీ బెయిర్‌స్టో (4), బెన్‌ ఫోక్స్‌ (16) సహా మార్క్‌వుడ్‌ (33)ను రవీంద్ర జడేజా మాయ చేశాడు. జడేజా మాయకు ఇంగ్లాండ్‌ ఓ దశలో 50/7తో దీన స్థితిలో నిలిచింది. కానీ టెయిలెండర్లు వేగంగా పరుగులు సాధించి ఆ జట్టును 100 పరుగుల మార్క్‌ దాటించగలిగారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసుకోగా.. కుటుంబ వైద్య అత్యవసర పరిస్థితితో రెండు రోజుల ఆటకు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌ నాల్గో రోజు బంతి అందుకున్నాడు. టామ్‌ హర్ట్‌లీ (16)ని అవుట్‌ చేసి కెరీర్‌ 501వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఐదో రోజుకు వెళ్తుందనుకున్న టెస్టు మ్యాచ్‌.. భారత బౌలర్ల దూకుడుతో నాలుగు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 71.1 ఓవర్లలో 319 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే చేతులెత్తేసింది.

‘ద్వి శతక’ జైస్వాల్‌

యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (214 నాటౌట్‌) ద్వి శతకంతో చెలరేగాడు. విశాఖ టెస్టులోనూ డబుల్‌ సెంచరీ బాదిన జైస్వాల్‌.. రాజ్‌కోట్‌లోనూ జోరు కొనసాగించాడు. వెన్నునొప్పితో మూడో రోజు ఆఖర్లో రిటైర్డ్‌ హర్ట్‌గా వైదొలిగిన యశస్వి.. నాల్గో రోజు ఉదయం సెషన్లోనే క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (68 నాటౌట్‌) జతగా 184 పరుగులు జోడించాడు. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 150 పరుగుల మార్క్‌ చేరుకున్న జైస్వాల్‌.. ద్వి శతకాన్ని 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 231 బంతుల్లోనే పూర్తి చేశాడు. మరోవైపు సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగ్రేట టెస్టులో వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 బంతుల్లో అర్థ సెంచరీ బాదాడు. టాప్‌ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ నమోదు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. సెంచరీ ముంగిట వికెట్‌ చేజార్చుకున్నాడు. నైట్‌వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌ (27) సైతం ఆకట్టుకున్నాడు. దీంతో 90 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసిన భారత్‌.. 556 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ఇచ్చింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టామ్‌ హర్ట్‌లీ, జో రూట్‌, రెహాన్‌ అహ్మద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

స్కోరు వివరాలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 445/10ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 319/10భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ నాటౌట్‌ 214, రోహిత్‌ శర్మ (ఎల్బీ) రూట్‌ 19, శుభ్‌మన్‌ గిల్‌ (రనౌట్‌) 91, రజత్‌ పటీదార్‌ (సి) రెహాన్‌ (బి) హర్ట్‌లీ 0, కుల్దీప్‌ యాదవ్‌ (సి) రూట్‌ (బి) రెహాన్‌ 27, సర్ఫరాజ్‌ ఖాన్‌ నాటౌట్‌ 68, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (98 ఓవర్లలో 4 వికెట్లకు) 430 డిక్లేర్డ్‌. వికెట్ల పతనం : 1-30, 2-191, 3-246, 4-258. బౌలింగ్‌ : అండర్సన్‌ 13-1-78-0, జో రూట్‌ 27-3-111-1, టామ్‌ హర్ట్‌లీ 23-2-78-1, మార్క్‌వుడ్‌ 10-0-46-0, రెహాన్‌ అహ్మద్‌ 25-1-108-1.

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ (ఎల్బీ) బుమ్రా 11, బెన్‌ డకెట్‌ (రనౌట్‌) 4, ఒలీ పోప్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 3, జో రూట్‌ (ఎల్బీ) జడేజా 7, జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) జడేజా 4, బెన్‌ స్టోక్స్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 15, బెన్‌ ఫోక్స్‌ (సి) ధ్రువ్‌ (బి) జడేజా 16, రెహాన్‌ అహ్మద్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్దీప్‌ 0, హర్ట్‌లీ (బి) అశ్విన్‌ 16, మార్క్‌వుడ్‌ (సి) జైస్వాల్‌ (బి) జడేజా 33, అండర్సన్‌ నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (39.4 ఓవర్లలో ఆలౌట్‌) 122.

వికెట్ల పతనం : 1-15, 2-18, 3-20, 4-28, 5-50, 6-50, 7-50, 8-82, 9-91, 10-122.

బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 8-1-18-1, మహ్మద్‌ సిరాజ్‌ 5-2-16-0, రవీంద్ర జడేజా 12.4-4-41-5, కుల్దీప్‌ యాదవ్‌ 8-2-19-2, రవిచంద్రన్‌ అశ్విన్‌ 6-3-19-1.

12 ద్వి శతక ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ కొట్టిన సిక్సర్లు 12. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ బాదిన 8 సిక్సర్లే ఓ భారత బ్యాటర్‌కు ఇప్పటివరకు అత్యధికం. రాజ్‌కోట్‌లో జైస్వాల్‌ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.

434

మూడో టెస్టులో భారత్‌ గెలుపు అంతరం 434 పరుగులు. గతంలో న్యూజిలాండ్‌పై 372 పరుగులే విజయమే అత్యుత్తమం. పరుగుల పరంగా ఇప్పుడు రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన విజయం అగ్రస్థానంలో నిలిచింది.

 

రూ.100 కోట్లతో కొత్త స్టేడియం!

హెచ్‌సీఏ ఏజీఎంలో ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్‌ : రూ.100 కోట్లతో కొత్త స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) తీర్మానం ఆమోదించింది. ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచ శ్రేణి శిక్షణ కేంద్రం, హైదరాబాద్‌ పరిధిలో నాలుగు శాటిలైట్‌ అకాడమీలు సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మినీ స్టేడియం నిర్మాణాలు చేపట్టనున్నారు. బీసీసీఐ నిధుల్లో కనీసం 30 నిధులను గ్రామీణ క్రికెట్‌ అభివృద్దికి ఖర్చు చేయనున్నారు. అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మహిళల క్రికెట్‌కు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఏజీఎం ఆమోదించింది. హెచ్‌సీఏ తరఫున బీసీసీఐ సమావేశానికి అధ్యక్షుడు జగన్‌మోహన్‌, కార్యదర్శి దేవరాజ్‌ రొటేషన్‌ విధానంలో హాజరుకావాలని సభ్యులు తీర్మానించారు. గతంలో రసాభాసాగా సాగిన హెచ్‌సీఏ సమావేశాలకు భిన్నంగా 86వ ఏజీఎం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.

➡️