ఫైనల్లోనూ చెలరేగాలి

Feb 11,2024 08:42 #Sports
  • రేపు ఆస్ట్రేలియాతో టైటిల్‌కై డీ
  • ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌
  • మధ్యాహ్నం 1.30గం||లకు

జహన్నెస్‌బర్గ్‌ : ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ను అత్యధికసార్లు నెగ్గిన టీమిండియా యువ జట్టు మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ టైటిల్‌ను రికార్డుస్థాయిలో ఐదుసార్లు ముద్దాడిన భారత్‌ 6వ సారి కప్‌ను చేజిక్కించుకొనేందుకు అడుగు దూరంలో నిలిచింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. ఈ టోర్నమెంట్‌లో ఓటమి ఎరుగని విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చింది. టోర్నమెంట్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ సంచలన విజయాలను నమోదు చేసుకుంది. లీగ్‌లో భారీ విజయాలతో ప్రత్యర్ధి జట్లను చిత్తుచేసిన టీమిండియా.. సూపర్‌6లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ అదే ప్రదర్శనను కనబర్చింది. దీంతో ఈసారి కప్‌ను చేజిక్కించుకోవడం ఖాయం అనుకున్న దశలో సెమీస్‌లో భారత్‌కు అసలు పరీక్ష ఎదురైంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన సెమీస్‌లో తొలుత ఓటమి కోరల్లో నిలిచి ఆ తర్వాత అద్భుత విజయాన్ని అందుకుంది. 245 ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 32పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచినా.. కెప్టెన్‌ ఉదరు సహారన్‌, సచిన్‌ ధాస్‌ కలిసి భారత్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. అదే ప్రతిభను ఫైనల్లోనూ కనబరిస్తే మరోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకోవడం ఖాయం. ఇక ఆస్ట్రేలియా యువజట్టు విషయానికొస్తే.. సెమీస్‌లో పటిష్ట పాకిస్తాన్‌పై వికెట్‌ తేడాతో నెగ్గి ఆ జట్టు ఫైనల్లోకి దూసుకొచ్చింది. 1988, 2010లలో టైటిల్‌ను చేజిక్కించుకున్న ఆసీస్‌.. 2018, 2012లలో రన్నరప్‌గా నిలిచింది. 2018 చివరిసారిగా ఫైనల్‌కు చేరిన ఆసీస్‌… భారత్‌ చేతిలో 8వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టుకు ఈ టైటిల్‌ 2010నుంచి అందని ద్రాక్షలా ఉంది. ఈసారి టోర్నమెంట్‌లో గ్రూప్‌-సిలో ఆసీస్‌.. ఓటమి ఎరుగక ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నేడు జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.

జట్లు(అంచనా).. భారత్‌(అండర్‌19)జట్టు: ఉదయ్ సహారన్‌(కెప్టెన్‌), ఆదర్ష్‌ సింగ్‌, కులకర్ణి, ముషీర్‌ ఖాన్‌, ప్రియాన్షు, సచిన్‌ ధాస్‌, అవనీశ్‌(వికెట్‌ కీపర్‌), మురుగన్‌ అభిషేక్‌, రాజ్‌ లింబని, నమన్‌ తివారి, సౌమీ పాండే.

ఆస్ట్రేలియా(అండర్‌19)జట్టు : హ్యూజ్‌ వెబ్జన్‌(కెప్టెన్‌), హారీ డిక్సన్‌, సామ్‌ కొంస్టాస్‌, హర్జాస్‌ సింగ్‌, రియాన్‌ హిక్స్‌(వికెట్‌ కీపర్‌), ఓలీవర్‌, చాంప్‌బెల్‌, మెక్‌మిల్లన్‌, టామ్‌ స్ట్రక్కర్‌, బీర్డ్‌మన్‌, కల్లమ్‌ విల్డేర్‌.

➡️