రెండోరౌండ్‌కు త్రీసా-గాయత్రి

Jan 30,2024 22:16 #Sports

థాయ్ లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: థారులాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లోకి రెండోరౌండ్‌లోకి యువజంట త్రీసా జోలీ-గాయత్రి ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో త్రీసా-గాయత్రి జంట 16-21, 21-10, 21-18తో హాంకాంగ్‌కు చెందిన లోక్‌ లూ-వింగ్‌ వాంగ్‌లపై చెమటోడ్చి నెగ్గారు. ఈ మ్యాచ్‌ సుమారు గంటా 14నిమిషాలసేపు హోరాహోరీగా సాగింది. రెండోరౌండ్‌లో భారత యువ షట్లర్లు సీనియర్‌ ప్లేయర్లు అశ్విని పొన్నప్ప- తానీషా క్రాస్టోతో తలపడనున్నారు. తొలిరౌండ్‌లో తానీషా-అశ్విని జంట 21-13, 21-17తో చైనీస్‌ తైపీ జంటను చిత్తుచేశారు. ఇక పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ, శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించారు. మంగళవారం జరిగిన అర్హతరౌండ్‌ తొలి రెండో పోటీలో వీరిద్దరూ విజయం సాధించారు. అర్హతరౌండ్‌ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి సింగిల్స్‌లో సమీర్‌ 21-9, 21-18తో హోవార్డ్‌ షూ(అమెరికా)పై, రెండోరౌండ్‌లో కువాన్‌-లిన్‌-క్యూను 16-21, 21-16, 21-15తో చిత్తుచేశాడు. ఇక సుబ్రమణియన్‌ తొలిరౌండ్‌లో 9-21, 21-17, 21-12తో సుగియార్టో(ఇండోనేషియా)ను, రెండోరౌండ్‌లో కొరక్రిత్‌(థారులాండ్‌)ను 20-22, 21-10, 21-14తో ఓడించారు. బుధవారం జరిగే ప్రధాన టోర్నీ తొలిరౌండ్‌లో సమీర్‌ వర్మ.. లాంగ్‌ అంగస్‌(హాంకాంగ్‌)తో, సుబ్రమణియన్‌ మలేషియాకు చెందిన జున్‌-హో-లింగ్‌తో తలపడనున్నారు.

➡️