టాప్‌-10లో విరాట్‌,రోహిత్‌

Jan 10,2024 22:23
  • ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. విరాట్‌ కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్‌ కోహ్లీ. అతను నాలుగు ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేశాడు. దీంతో గతంలో ఉన్న 9వ ర్యాంకు నుంచి 775 పాయింట్లతో 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. గతంలో 14వ ర్యాంక్‌లో ఉన్న రోహిత్‌ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 748 పాయింట్లతో 10వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ టెస్ట్‌ ర్యాకింగ్స్‌ విభాగంలో తొలిస్థానంలో కేన్‌ విలియమ్సన్‌ (864 పాయింట్లు) నిలిచాడు. జో రూట్‌ (859), స్టీవ్‌ స్మిత్‌ (818 పాయింట్లు), మార్నస్‌ లబూషేన్‌ (802 పాయింట్లు), డారిల్‌ మిచెల్‌ (786 పాయింట్స్‌) టాప్‌ ఫైవ్‌ బ్యాటర్లుగా నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో 6/15తో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 13స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా 4వ స్థానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియన్‌ కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ సౌతాఫ్రికా ప్లేయర్‌ రబాడను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. జాష్‌ హెజిల్‌ వుడ్‌ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని జేమ్స్‌ ఆండర్సన్‌తో కలిసి ఏడో స్థానంలో నిలిచాడు.

➡️