బ్రిజ్‌ భూషణ్‌ చేతిలోనే డబ్ల్యుఎఫ్‌ఐ

Dec 22,2023 09:55 #Sports

ఎన్నికల్లో ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్‌ గెలుపు

నిరసనగా రెజ్లర్ల రాజీనామా

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజరుసింగ్‌ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌కు ఇటీవల ఎన్నికలు జరగ్గా.. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో సంజయ్ సింగ్‌ 40 ఓట్లు రాగా.. ప్రత్యర్ధి అనితా షెరాన్‌కు కేవలం 7 ఓట్లు మాత్రమే దక్కాయి. రెజ్లింగ్‌కు గుడ్‌బై: సాక్షిబ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుని గెలుపుతో ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. సంజరు సింగ్‌ గెలుపుతో మహిళా రెజ్లర్లు మళ్లీ వేధింపులకు గురవుతారని, ఈ ఫెడరేషన్‌కి ఓ మహిళ అధ్యక్షురాలు కావాలనుకున్నామని, కానీ అది జరగలేదని, దేశంలో న్యాయం ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం మీడియాముందు భోరున విలపించారు. సంజరు సింగ్‌ గెలుపుతో డబ్లుఎఫ్‌ఐపై బ్రిజ్‌ ఉక్కుపాదం ఎంత బలంగా ఉందో ఈ ఎన్నికల స్పష్టం చేశాయని స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ విమర్శించారు. తమ కెరీర్‌ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని, తాము ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియడం లేదని బజరంగ్‌ పూనియా ఆవేదన వ్యక్తం చేశారు. సంజరుసింగ్‌ గతంలో ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ చివరి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, 2019 నుండి జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రస్తుత మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అధ్యక్ష పదవితో పాటు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, నలుగురు ఉపాధ్యక్షులు, సెక్రటరీ జనరల్‌, కోశాధికారి, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలు, ఐదుగురు కార్యనిర్వాహక సభ్యుల భర్తీకి ఎన్నికలు జరిగాయి. డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియ జులైలో ప్రారంభం కాగా.. కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యాయి. దీంతో అంతర్జాతీయ రెజ్లింగ్‌ సంస్థ డబ్ల్యుఎఫ్‌ఐని సస్పెండ్‌ చేసింది. ఎన్నికలపై పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఎన్నికలకు లైన్‌ క్లియరైంది.

➡️