అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులందరికీ అందించటమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు రూరల్‌ లాల్‌పురంలోని ఎఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో జరిగిన వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర ప్రారంభోత్సవానికి గవర్నర్‌ హాజరయ్యారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ఐఈసీ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలలో ప్రజల సంతప్తి స్థాయిని పెంచే ప్రధాన ఉద్దేశంతో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహిస్తోందన్నారు. అర్హతుండి, పథకాల ప్రయోజనాలు పొందని వారికి లబ్ధి అందించటం, పథకాల గురించి వివరించటం, అవగాహన కల్పించటం, పథకాల లబ్ధిదారులను నేరుగా కలసి వారి అనుభవాలను పంచుకోవటం, యాత్ర సమయంలో గుర్తించిన అర్హులకు పథకాలు అమలుకు నమోదు చేయటం ప్రధాన లక్ష్యాలుగా గవర్నర్‌ వివరించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ప్రధాన కార్యక్రమాల్లో పేదకుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణకు ఏడాదికి రూ.5 లక్షలు ఆయుష్మాన్‌ భారత్‌ యోజన ద్వారా అందిస్తుందన్నారు. ప్రదాన మంత్రి ఆవాస్‌ యోజన, అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ అర్బన్‌ వంటి పథకాలతో పాటు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పిఎం స్వానిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించటం తదితర కార్యక్రమాలను అమలు జరుగుతున్నాయన్నారు. ఈ యాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 26 వరకు జిల్లాలోని 258 గ్రామాల్లో 60 రోజుల్లో, గుంటూరు, తాడేపల్లి మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు తెనాలి, పొన్నూరు మున్సిపాల్టీల్లో 40 ప్రాంతాల్లో 20 రోజుల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను జిల్లాకు కేటాయించిన రెండు ప్రచార వాహనాలు ద్వారా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సభలో వికసిత్‌ భారత్‌ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఆదర్శ రైతు ఆవుల వెంకటేశ్వర్లు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న స్వయం సహాయక సంఘ సభ్యురాలు కొప్పుల జయ, లాలుపురం ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామంగా తీర్చిదిద్దినందుకు గ్రామ ప్రత్యేక అధికారి కె.శ్రీనివాస్‌ను గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సన్మానించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రపై ఇన్పర్మేషన్‌ బ్యూరో రూపొందించిన పుస్తకాలను గవర్నర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తొలుత పౌర సరఫరాల శాఖ, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఆరోగ్య శాఖ ఆయుష్మాన్‌ భారత్‌, టీబీ స్క్రీనింగ్‌, ఎలిమినేషన్‌, నెహ్రుయువకేంద్రం, గ్రామ వార్డు సచివాలయ శాఖ, మై భారత్‌ వాలంటీర్‌ ఎన్రోల్మేంట్‌, ఆధార్‌ క్యాంప్‌, వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను గవర్నర్‌ సందర్శించారు. కార్యక్రమంలో గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజరు జైన్‌, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభరి అధికారి పీయూష్‌ కుమార్‌, గుంటూరు రేంజ్‌ ఐజి పాల్‌రాజు, ఎంపి అయోధ్య రామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, జేసీ రాజకుమారి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, మద్దాళి గిరిధర్‌, నగర మేయర్‌ కావటి మనోహరనాయుడు, జీడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామంజనేయులు పాల్గొన్నారు.

➡️