ఆన్‌లైన్‌ మోసాల పట్ల అవగాహన అవసరం

Mar 1,2024 20:51

అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

– లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ రామచంద్ర
ప్రజాశక్తి – ఆదోని
ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ రామచంద్ర సూచించారు. శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆదేశాల మేరకు ఆదోనిలో ఆర్‌బిఐ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ మైదానం నుంచి ఎమ్మిగనూరు టర్నింగ్‌ వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ విషయాల్లో అనుభవం గడించాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక యుగంలో టెక్నాలజీ అందుబాటులోకి రావడం మంచిదేనని తెలిపారు. అందుకు అనుగుణంగానే మోసాలు కూడా పెరిగాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిరక్షరాస్యులకు ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. చీఫ్‌ మేనేజర్‌ వీరాంజనేయులు, నెహ్రూ మెమోరియల్‌ ప్రధానోపాధ్యాయులు అలీమ్‌ సిద్ధిఖీ, మున్సిపల్‌ హై స్కూల్‌ ఇన్‌ఛార్జీ ప్రధానోపాధ్యాయులు ఫయాజ్‌, ఉపాధ్యాయులు రామయ్య, సుధాకర్‌, కల్యాణ్‌, నిరంజన్‌, చంద్రమౌళి, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

➡️