ఆశాలపై అరాచకం..

ప్రజాశక్తి – భీమవరం

ఏదైనా కారణం చేత మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత సంబంధిత మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో మహిళలు గానీ మహిళ పోలీసుల పర్యవేక్షణలో గానీ వారిని పోలీస్‌స్టేషన్లో ఉంచాలన్నది చట్టం చెబుతోంది. కానీ జిల్లాలో పోలీస్‌ శాఖ చట్టం ఆదేశాలను తుంగలోకితొక్కి ఆశా కార్యకర్తలపై అరాచకానికి పాల్పడింది. ఆశా కార్యకర్తలపై తీవ్ర నిర్బంధాన్ని విధించి అక్రమంగా అరెస్టు చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలను విడుదల చేయాలని, ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెళ్లుబికాయి. ఆశా కార్యకర్తలపై విధించిన నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండించింది.ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చలో విజయవాడ ధర్నాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసులను ఉపయోగించి ఆశాలపై తీవ్ర నిర్బంధాన్ని విధించింది. బుధ, గురువారాల్లో ఆశాల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ముందస్తు నోటీసులు జారీచేసి విజయవాడ వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ నిర్బంధాన్ని ఎదుర్కొని విజయవాడ వెళ్లే ఆశాలపై పోలీసులు కర్కసంగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్ట్‌ల వద్ద వారి కోసం జల్లెడ పట్టి అక్రమ అరెస్టులు చేసి నిర్బంధాన్ని విధించి వివిధ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, పోడూరు పాలకోడేరు, తణుకు, ఆచంట, కాళ్ల, ఆకివీడు, వంటి ప్రధాన ప్రాంతాల్లో సుమారు 200 మందిని అక్రమంగా అరెస్టు చేశారు. మగ, పోలీసులు ఆశాల పట్ల దురుసుగా వ్యవహరించడమే కాకుండా దుర్భాషలాడారు. ఆశాల వద్ద సెల్‌ ఫోన్లు లాక్కుని చేతులు పట్టుకుని మరీ అరెస్టు చేశారు. భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో భీమవరం పట్టణం, భీమవరం రూరల్‌, వీరవాసరం, ఉండి, కాళ్ల, మొగల్తూరు మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలను అరెస్టులు చేసి నిర్బంధించారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కార్యకర్తలను వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించి రాత్రంతా నిర్బంధించారు. భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 20 మంది ఆశాలను, పాలకోడేరులో మరో ఇద్దరిని రాత్రి రెండు గంటల వరకూ నిర్బంధించి అక్కడి నుంచి హన్సిక కళ్యాణ మండపానికి తరలించారు. పాలకొల్లు పోలీస్‌ స్టేషన్లో మరికొంతమంది ఆశాలను 12 గంటల వరకూ ఉంచారు. జిల్లా నలుమూలల నుంచి బయలుదేరిన మరో 200 మందిని వివిధ ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధించి అరెస్టులకు పాల్పడ్డారు. అయితే ఈ నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని సుమారు 200 మంది ఆశాలు విజయవాడ మహా ధర్నాకు బయలుదేరి వెళ్లారు. అరెస్టు చేసిన, నిర్బంధించిన వారిని తక్షణం విడుదల చేయాలని పోలీస్‌స్టేషన్ల వద్ద నిరసనలు తెలిపారు. వివిధ పోలీస్‌ స్టేషన్ల వద్ద సిఐటియు నేతలు, ఆశా కార్యకర్తలు ధర్నాలు చేశారు. అక్రమ నిర్బంధం, అరెస్టులను సిఐటియు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు తీవ్రంగా ఖండించాయి.భీమవరంలో హోరెత్తిన ఆశాల నిరసన..ఆశాల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసిస్తూ భీమవరంలో నిరసనలు హోరెత్తాయి. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ నిరసన ప్రదర్శన చేసి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అరెస్టులు చేయడమే కాకుండా దుర్భాషలాడటం, చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లు లాక్కోవడం, మగ పోలీసులే స్టేషన్లకు తీసుకెళ్లడం పట్ల ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేసి పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, డి.కళ్యాణి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి గొప్పగా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేసి, నిర్బంధించి ఉద్యమాలను ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి హాజరైన ఆశా వర్కర్లతోపాటు సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌, త్రిమూర్తులు, దీపిక, విజయలక్ష్మి పాల్గొన్నారు.

➡️