ఎస్మాను రద్దు చేయాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమ్మె చేపట్టిన

సంఘీభావం ప్రకటిస్తున్న అఖిలపక్ష నాయకులు

  • అంగన్వాడీలకు జీతాలు పెంచాలి
  • సంక్రాంతి లోపు సమస్యలు పరిష్కరించకుంటే
  • ప్రత్యక్ష కార్యాచరణప్రభుత్వానికి అఖిలపక్ష నాయకుల హెచ్చరిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమ్మె చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటి ఎటువంటి కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తోందని విమర్శించారు. అంగన్వాడీలు అతి తక్కువ వేతనాలతో వారి కుటుంబాలను ఏవిధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఏం కావాలో తెలుసుకోకుండా భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి సరైన ఆర్థిక విధానం లేదని, సమస్యలపైనా అవగాహన లేదని విమర్శించారు. 31 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నా మంత్రులకు పట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అబద్దాలకు అంతు లేకుండా పోయిందని విమర్శించారు. ఎస్మా ప్రయోగించినా అంగన్వాడీలు పట్టు వీడడం లేదంటే వారి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అంగన్వాడీలు అత్యవసర విభాగం అని భావిస్తే, ఇన్ని రోజులు ఎందుకు సమస్యను పరిష్కరించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తుంటే అరెస్టులు చేయడం తెలివితక్కువతనమని విమర్శించారు. సంక్రాంతిలోపు అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగడంతో పాటు రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీలపై విధించిన ఎస్మా జిఒ నంబరు 2ను వెంటనే రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు పేడాడ రామ్మోహనరావు, సిపిఐ నాయకులు చాపర సుందరలాల్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కోశాధికారి ఎ.సత్యనారాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, ప్రకాష్‌, ఎం.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️