ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తారా..? గద్దె దిగిపోతారా..?

Mar 1,2024 20:48

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు

– యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
– గోనెగండ్లలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’
ప్రజాశక్తి – గోనెగండ్ల
రాష్ట్రంలో 11 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూర్చే ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తారా..? లేదంటే అధికారంలో నుంచి గద్దె దిగిపోతారా అని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం గోనెగండ్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒపిఎస్‌ను అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా ఒపిఎస్‌ను పునరుద్ధరించలేదని చెప్పారు. ఇప్పుడు ఆర్థిక కారణాల సాకు చూపి జిపిఎస్‌, సిపిఎస్‌ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం మోసం చేయడమేనని విమర్శించారు. గత జనవరి 28న రాజమండ్రిలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులతో సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎవరైతే ఒపిఎస్‌ను అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటిస్తారో వారికే ఓటు వేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్‌టియు నాయకులు తిమ్మన్న, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రవికుమార్‌, సహాధ్యక్షులు హేమంత్‌ కుమార్‌, నాయకులు యెహోషువా, నరసింహులు, ఎల్లప్ప, గుమ్మలబాబు, చంద్రపాల్‌, మద్దిలేటి, రామన్‌, లింగన్న, సలీం, నాగేశ్వర రావు, అక్బర్‌, రాముడు పాల్గొన్నారు.

➡️