కొనసాగిన రిలే దీక్షలు

దీక్షలో కూర్చున్న ఆదివాసీలు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న హుకుంపేట విఆర్‌ఓ, ఆర్‌ఐలను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్‌ చేసారు. గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు తొలగించాలని చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజనులు మాట్లాడుతూ, గిరిజనేతరురాలు బుడ్డిగ కోండమ్మ పాత వెలుగు కార్యాలయం, పంచాయితీ కార్యాలయం స్థలాలను ఆక్రమించుకుని గృహాలు, భవనాలు నిర్మిస్తుందని తెలిపారు. వెలుగు కార్యాలయం స్థలాన్ని ఆక్రమించుకుని విఆర్‌ఓ, ఆర్‌ఐల సహకారంతో మరో భవనం నిర్మించు కొందన్నారు. వెలుగు సిబ్బంది నాటిన జామ, అరటి తోటలు రెవెన్యూ అధికారులు దగ్గరుండి నరికించి నట్టు వారు తెలిపారు.1/70 చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులపై శాఖ పరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆక్రమణ దారులపై ఎల్‌టిఆర్‌ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టే వరకు దీక్షలు విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొర్ర ఆనంద్‌, కిల్లో రామారావు, ఒరబొయిని మత్య్స రాజు, విజరు, చిన్నయ్య, రాము, ఆదివాసి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలు దొర, జీవో నెంబర్‌ 3 ఆదివాసి సాధన కమిటీ అల్లూరి జిల్లా కో కన్వీనర్‌ కూడెలి నూకరాజు, డుంబ్రిగూడ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కుర్ర నాగరాజు, నాయకులు బాబురావు, భీమన్న, మోహన్‌, థామస్‌, చంటి పాల్గొన్నారు.

➡️